మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) నిధుల్ని సేకరించడం ఎలా?? అనే దానిపై దాసరి నారాయణరావు ఓ సలహా ఇచ్చారు. మన హీరోలు కోట్లు కోట్లు తీసుకొంటున్నారు కదా, వాళ్లని చందాలు అడుగుదాం.. కనీసం పది కోట్లయినా రాకుండా పోతాయా? అన్నది ఆయన మాట. దాసరి ఆలోచన భేషుగ్గా ఉంది. మన స్టార్ హీరోలంతా కోట్లకు పడగలెత్తుతున్నవాళ్లే. ఒక్కో సినిమాకి రూ.15 కోట్ల నుంచి 20 కోట్ల వరకూ తీసుకొనేవాళ్లున్నారు. కనీసం ఒకొక్కరూ పాతిక లక్షలిచ్చినా.. పది కోట్లు కూడబెట్టడం పెద్ద కష్టమేం కాదు. అయితే మనవాళ్లు పేరుకే హీరోలు. వాళ్లంతా కాసులు రాలుస్తారా.. అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
హుద్ హుద్ బాధితుల్ని ఆదుకోమంటేనే.. డబ్బులు విదలచ్చడానికి తెగ బాధ పడిపోయారు. మేము సైతం అనే పోగ్రాం పెట్టి, మామూలు జనాలతో టికెట్లు కొనిపించి.. నిధులు సేకరించారు. విశాఖ తీరం కొట్టుకుపోతే… జేబులోంచి పైసా తీయడానికి తెగ హైరానా పడిపోయినవాళ్లు ఇప్పుడు ‘మా’ కోసం పాతికేసి లక్షలు ఇచ్చేస్తారనుకోవడం భ్రమ కాకపోతే మరేంటి? ఓ సినిమా ద్వారా పారితోషికం తీసుకొంటున్న ప్రతీ నటుడూ విధిగా కనీసం 2 శాతం రెమ్యునరేషన్ ‘మా’కి కేటాయించాల్సిందే అనే నిబంధన ఉంటే తప్ప… దాసరి పది కోట్ల ఆశ తీరదు. హీరోల దగ్గర చేయి చాచడం కంటే ఈ నిబంధన ఏదో బెటర్‌గా ఉంటుంది. ఆ దిశగా ఆలోచిస్తే మంచిదేమో?!