దర్శకరత్న దాసరి నారాయణరావు వెళ్ళిపోయారు. చివరికి వరకూ పరిశ్రమ, సినిమానే శ్వాసగా బ్రతికిన దాసరి శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. అయితే ఆయనికీ తీరని కోరికలు కొన్ని మిగిలిపోయాయ్. సినిమా కోరికలే. మొదటిది భారతం. ఎప్పటికైనా మహా భారతంను వెండితెరపై చూపించాలని అనుకున్నారు దాసరి. ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పారు.
రెండోది పవన్ కళ్యాణ్ తో సినిమా. పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయాలనని దాసరి కోరిక. పవన్ సైతం దాసరి తో సినిమా చేస్తానని చెప్పారు. వీరిద్దరూ కాంబినేషన్ కు తగ్గ కథ కోసం చాలా అన్వేషణ జరిగింది. త్రివిక్రమ్ కధ ఓకే అయ్యిందని కూడా వార్తలు వచ్చాయి. ఇటీవల పవన్ పుట్టిన రోజు సందర్భంగా తమ తారక ప్రభు ఫిలింస్ బ్యానర్లో 38వ సినిమాగా పవన్ తో సినిమాను నిర్మిస్తున్నట్టుగా ఓ యాడ్ కూడా ఇచ్చారు.
ఇది కాకుండా దాసరి మనసులో మరో సినిమా కూడా వుంది. ఇది బయోపిక్. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితాన్ని వెండితెరపై చూపించాలని భావించారట దాసరి. దీనికి ఆయన హీరోయిన్ ని కూడా ఫిక్సయిపోయారు. స్వీటీ అనుష్క ను జయలలితగా చూపించాలని అనుకున్నారట. ఈ మేరకు ఆయన సన్నిహిత వర్గాలతో చర్చలు కూడా జరిపారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో దిన్ని రూపొందించే భారీ ప్రణాళికను సైతం సిద్దం చేసుకున్నారట. అయితే ఇంతలోనే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడం బాధాకరం.