విజయవాడ వైసీపీ ఎంపీగా అభ్యర్థిగా… విజయ్ ఎలక్ట్రికల్స్ చైర్మన్ , ఆంధ్రజ్యోతి పత్రికలో ఓ వాటాదారుగా ఉన్న దాసరి జైరమేష్ పోటీ చేయడం దాదాపుగా ఖాయమైపోయింది. దాసరి జై రమేష్.. వైసీపీలో చేరడానికి ముహుర్తం ఖరారు చేసుకున్నారు. చాలా రోజుల నుంచి విజయవాడ ఎంపీ టిక్కెట్ ఎవరికి ఇవ్వాలా.. అని జగన్మోహన్ రెడ్డి.. చాలా మంది పారిశ్రామికవేత్తల పేర్లు పరిశీలిస్తున్నారు. కానీ ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. చివరికి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు .. దాసరి జై రమేష్‌ను.. ఒప్పించి.. జగన్ వద్దకు తీసుకెళ్తున్నారు. ఎన్టీఆర్ హయాంలో.. దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో పాటు దాసరి జై రమేష్ కూడా.. టీడీపీలో కీలకంగా వ్యవహరించారు.
2014 ఎన్నికల ముందు వరకు.. ఆయన సోదరుడు దాసరి బాలవర్ధనరరావు.. టీడీపీ తరపున ఎమ్మెల్యేగా రెండు సార్లు గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. గత ఎన్నికల్లో మాత్రం ఆయనను పక్కన పెట్టి.. వల్లభనేని వంశీకి చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారు. అప్పట్నుంచి సోదరులిద్దరూ.. పెద్దగా.. రాజకీయాల్లో కనిపిచండం లేదు. నిజానికి దాసరి జై రమేష్.. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ లేరు. ఓ సారి విజయవాడ నుంటి టీడీపీ తరపున పోటీ చేసి.. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఉపేంద్ర చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత మళ్లీ పోటీ చేయలేదు. కానీ ఇప్పుడు.. వైసీపీ తరపున పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు.
దాసరి జై రమేష్… ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతిలో వాటాదారుగా ఉన్నారు. వేమూరి రాధాకృష్ణ.. నేతృత్వంలో ఆంధ్రజ్యోతి పునంప్రారంభ సమయంలో… ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు. ఎక్కువగా ఆయనే పెట్టుబడులు పెట్టారని చెబుతారు. తర్వాత ఆయన మైనర్ వాటాదారుగా మారిపోయారు. ప్రస్తుతం… ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఓ వాటాదారుగా ఉన్నారు. ప్రతి ఏడాది మార్చి ఒకటో తేదీన నిబంధనల ప్రకారం ప్రతి పత్రిక.. ఫామ్ IV ను ప్రచురిస్తూ ఉంటుంది. ఇప్పటికీ.. దాసరి జై రమేష్ పేరు వాటాదార్ల జాబితాలో ఉంటూనే ఉంటుంది. వైసీపీని తీవ్రంగా వ్యతిరేకించే.. పత్రికలో వాటాలు ఉన్న వ్యాపారవేత్త.. ఇప్పుడు అదే పార్టీ తరపున వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది.