150 చిత్రాల దర్శకుడిగా అరుదైన ఘనత వహించారు దర్శక రత్న దాసరి. యాభై ఏళ్లుగా దర్శకుడిగా కొనసాగడం… చలన చిత్రసీమలోనే ఓ అరుదైన రికార్డు. అది దాసరికే సాధ్యమైంది. అందుకే ఇప్పుడున్న దర్శకులందరికీ ఆయన గురువు! త్వరలోనే ఆయన మెగా ఫోన్ వదిలి… అస్త సన్యాసనం చేయబోతున్నారు. ఈ విషయాన్ని దాసరి స్వయంగా ప్రకటించారు. ”మహాభారత గాథని 5 భాగాలుగా తీస్తా. దర్శకుడిగా నా ఆఖరి చిత్రం మహాభారతమే అవుతుంది. ఆ తరవాత విశ్రాంతి తీసుకొంటా” అని ప్రకటించారు దాసరి.
“యాభై ఏళ్లు దర్శకుడిగా కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. ప్రేక్షకుల ఆశీర్వాద బలంతోనే ఆ రికార్డు సాధ్యమైంది. ఇక చేసింది చాలు.. ఇంకా ఏదో చేయాలన్న తపన ఉన్నా… వయసు సహకరించడం లేదు“ అని చెప్పుకొచ్చారాయన. త్వరలోనే దాసరి ఓ ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రానికి ఆయనే దర్శకుడు. తన సినిమా కోసం నూతన నటీనటుల్ని ఎంచుకొంటారట. ప్రేమ కథా చిత్రం పూర్తయిన తరవాత మహాభారతం తెరకెక్కించే అవకాశం ఉంది.