రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలనట్లు కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయినా దాని హయాంలో జరిగిన బొగ్గు గనుల కుంభకోణం కేసులు మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగుతో సహా అందరినీ భూతంలా వెంటాడుతూనే ఉన్నాయి. ఆ కుంభకోణంలో నిందితుడిగా చార్జ్ షీట్లో పేర్కొనబడిన వారిలో దర్శకుడు దాసరి నారాయణ రావు కూడా ఒకరు. కాంగ్రెస్ హయంలో బొగ్గు శాఖ సహాయ మంత్రిగా చేసినప్పుడు ఈ గనుల కేటాయింపులో ఆయనకు చెందిన ఒక రికార్డింగ్ స్టూడియోకి ముడుపులు అందాయని సీబీఐ ఆరోపించింది.
కానీ దాసరి మాత్రం ఈ వ్యవహారంలో తన చేతికి అసలు మసి అంటలేదని వాదిస్తున్నారు. సహాయ మంత్రిగా ఉన్న తనకు గనుల కేటాయింపులు చేసే అధికారం లేదని గనుల పంపకాలన్నీ పెద్దాయన మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగు సమక్షంలోనే ఆయనకు పూర్తిగా తెలిసే జరిగాయని సీబీఐ కోర్టులో లిఖిత పూర్వకంగా తెలియజేసారు. అటువంటప్పుడు సహాయ మంత్రిగా తనను సీబీఐ దోషిగా పేర్కొనడాన్ని ఆయన తప్పు పట్టారు. ఈ కుంభకోణంలో మొత్తం బాధ్యత అంతా మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగుదేనని తేల్చి చెప్పారు.
కానీ మన్మోహన్ సింగ్ కూడా ఈ వ్యవహారంలో తన చేతికి మసి అంట లేదని వాదిస్తున్నారు. ఎవరి చేతికీ మసి అంటకపోతే బొగ్గు గనులన్నీ ఎలాగా మాయం అయిపోయాయి? ఎవరు మాయం చేసేసారు? అని సీబీఐ ప్రశ్నిస్తోంది. దానికి సమాధానం అందరికీ తెలుసు. కానీ ఎవరూ బయటకి చెప్పడం లేదు. డా. మన్మోహన్ సింగును ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టి వెనుక నుండి రాజ్యం ఏలిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీయే అన్ని కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. ఆమెకి తెలియకుండా, ఆమె అనుమతి లేకుండా ఏదీ జరగలేదు. కానీ ఆమె తీసుకొన్న నిర్ణయాలను, ఆదేశాలను అమలు చేసిన పాపానికి అందరూ బలయిపోతున్నారు. సీబీఐ లాగుతున్న ఈ తీగతో ఆ డొంక కదులుతుందో లేదో చూడాలి.