ఇండస్ట్రీలో స్టార్లు, సూపర్ స్టార్లు చాలామంది ఉన్నారు.
లెజెండ్లు, సెలబ్రెటీలకైతే లెక్కేలేదు.
కానీ గురువు ఒక్కరే. ఆయనే దాసరి… దాసరి నారాయణరావు.
ఇండస్ట్రీ మొత్తం గురువుగారూ.. అనిపిలుచుకొనే వ్యక్తి.. ఒకే ఒక్క దాసరి.
దర్శకుడిగా ఆయనేంటి? ఆయన ప్రతిభేంటి? అనేది ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పనిలేదు. ఆయన తీసిన 150 సినిమాలే ఆ విషయం చెబుతాయి. ఆయన ఉన్నా, లేకున్నా – ఆయన చిత్రాలు జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. దాసరి వ్యక్తిత్వాన్నీ, ప్రతిభను, విశిష్టతనూ శిష్య బృందం కొంతలో కొంత కాపాడుతోంది. కానీ ఇండస్ట్రీకి ‘పెద్ద’గా దాసరి లోని లోటు సుస్పష్టం. ఈ విషయంలో దాసరి స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేదు.. చేయలేరు కూడా!
ఇండస్ట్రీ ఎప్పుడు ఏ సమస్యలో ఉన్నా, గుర్తొచ్చేది దాసరి మాత్రమే. చిన్న సినిమా ఇబ్బందుల్లో ఉంది అంటే ఆయన ముందుండేవారు. కార్మికులకు కష్టాలొచ్చాయి అనగానే ఆయన రెక్కలు కట్టుకొని వాలిపోయేవారు. ఎలాంటి సమస్య అయినా చెప్పండి. ఆయన దగ్గర పరిష్కార మంత్రం ఉండేది. కొన్ని పరిష్కరించలేని ఇబ్బందులకు సైతం దాసరి ఇంట్లో పంచాయితీ జరిగేది. బాధితుల పక్షం దాసరిది. అందుకోసం ఆయన ఎంతమందినైనా ఎదిరించేవారు. దాసరి ఓ మాట చెప్పారంటే.. చిత్రసీమ మొత్తం పాటించేది. అలా ఉండేది ఆయన పలుకుబడి.
అయితే దాసరి మరణం తరవాత.. అలాంటి పెద్ద దిక్కుని ఇండస్ట్రీ కోల్పోయింది. కరోనా ముందూ, ఆ తరవాత.. చిత్రసీమ సంక్షోభంలో పడింది. ముఖ్యంగా జగన్ సర్కారు ఆడిన వికృత క్రీడకు బలైంది. టికెట్ రేట్ల విషయంలో జరిగిన అన్యాయంపై ఆ రోజు ఎవరు ఎంత గొంతు చించుకొన్నా ఫలితం లేకుండా పోయింది. అప్పట్లోనే దాసరి లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించింది. చిరంజీవి ఆ బాధ్యతను కొంత వరకూ భుజాలపై వేసుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఇండస్ట్రీ మొత్తాన్నీ ఒకే తాటిపైకి తీసుకురావడం కష్టమనే విషయాన్ని చిరు గ్రహించారు. ముఖ్యంగా ప్రభుత్వాలతో పనులు చేయించుకోవడం అంత సులభం కాదన్న విషయం జగన్ తీరుతో అర్థమైంది. ఆ తరవాత కొన్ని విషయాల్ని చిరు పట్టించుకొని, పట్టించుకోనట్టు వదిలేశారు. అలాంటి సమయంలో దాసరి ఉండి ఉంటే ఆ లెక్కే వేరుగా ఉండేది. దాసరికి పార్టీలతోనూ, ప్రభుత్వాలతోనూ పనిలేదు. ఎవరున్నా మొండిగా వెళ్లిపోయేవారు. కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు దాసరి మాట ఇంకాస్త బాగా చెల్లుబాటు అయ్యేది. అలా… చాలా సమస్యల్ని నోటి మాట ద్వారా పరిష్కరించారు. అయితే.. ఇప్పుడు అలాంటి పెద్ద దిక్కు లేదు. సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పుడు చిత్రసీమ ఉంది. దర్శకుడిగా దాసరి స్థానాన్ని చాలామంది భర్తీ చేస్తారు. నటుడిగా, రచయితగా దాసరికి రీప్లేస్మెంట్ ఉంటుంది. కానీ.. గురువుగా, పెద్ద దిక్కుగా ఆయన స్థానంలోకి మరెవ్వరూ రాలేరు. ఓరకంగా ఇది చిత్రసీమ దురదృష్టం.
(ఈరోజు దాసరి నారాయణరావు జయంతి)