చిత్రసీమని మళ్లీ స్వర్ణయుగాన్ని పరిచయం చేసింది దాసరి!
రచయితే దర్శకుడైతే… ఎన్ని అద్భుతాలు చేయొచ్చో.. చెప్పింది దాసరి!
దర్శకుడే కెప్టెన్ – అని స్టార్ హీరోలూ ఒప్పుకునేలా చేసింది.. దాసరి!
శిష్యులతో హిట్లు కొట్టింది దాసరి.. వాళ్లని నిలబెట్టింది దాసరి. విలన్లను హీరోలుగా మార్చి.. క్యారెక్టర్ ఆర్టిస్టుతో కథలు నడిపించి, జూనియర్ ఆర్టిస్టుని సైతం తీసుకొచ్చి – తెరపై నిలబెట్టింది దాసరి.
ఓ వ్యక్తి సినిమాకి ఇంకేం చేయగలడు? ఇంతకన్నా ఏం చూపించగలడు?
అగ్ర దర్శకులుగా చలామణీ అవుతున్న ఈతరం వాళ్లంతా ఏడాదికి ఒక సినిమా చేస్తే గొప్ప. కొంతమంది రెండేళ్లకు ఓ సినిమా లాగిస్తున్నారు. ఎవరి కెరీర్ లోనూ పట్టుమని పాతిక సినిమాలుండడం లేదు. పూరి 25 సినిమాలు పూర్తి చేస్తే… ఆహా అన్నారు. అలాంటిది దాసరి 150 సినిమాల మైలు రాయిని అలవోగగా అందుకున్నాడు.తన కథల్ని శిష్యులకు ఇచ్చి సినిమాలు తీయించాడు గానీ, అవి కూడా లెక్కేసుకుంటే 200 సినిమాలు ఈజీగా అయిపోదును. ఇది ఎవరికీ సాధ్యం కాని ప్రపంచ రికార్డ్. అన్నపూర్ణ స్టూడియోలో నాలుగు ఫ్లోర్లు ఉంటే. ఆ నాలుగింటిలోనూ దాసరి సినిమానే సెట్స్‌లో ఉండేదంటే – దాసరి హవా ఏ స్థాయిలో నడిచిందో అర్థం చేసుకోవొచ్చు. షూటింగ్ కి మధ్య బ్రేకిచ్చి… ఆ గ్యాప్‌లో ఓ అగ్ర హీరోకి కథ చెప్పి, ఓకే చేయించుకున్నాడంటే… దాసరి స్పీడు లెక్కేసుకోవొచ్చు. లంచ్ బ్రేక్ లో.. చెట్టుకింద కూర్చుని, మరో సినిమా డైలాగులు రాసుకున్నాడంటే – దాసరి స్టామినా ఏంటో కనిపెట్టొచ్చు. అందుకే దాసరి.. తిరుగులేని స్థానాన్ని ఆక్రమించుకోగలిగారు.
వెండి తెర కోసం ఆయన చేసిందంతా కళ్లముందు కనిపిస్తుంటుంది. తెర వెనుక చేసింది.. కేవలం చిత్రసీమకు మాత్రమే తెలుసు. దాసరి తీసుకున్న నిర్ణయాలు, తన ముందు చూపు పరిశ్రమకు ఎంత మేలు చేసిందో నటీనటులు, నిర్మాతలు కథలు కథలుగా చెబుతారు. దాసరి మాటే పరిశ్రమ మాట.. పరిశ్రమ మాటే దాసరి మాట అనేంత పలుకుబడి సంపాదించుకోవడం మామూలు విషయం కాదు. దాసరి ఏం చేసినా.. మన మంచికే అని చిత్రసీమ చేత అనిపించుకున్నాడు కాబట్టే – ఆ స్థానం దక్కింది. చివరి వరకూ ఆ స్థానం దాసరిదే. ఇప్పటికీ.. ఆ స్థానం అలా ఖాళీగానే ఉంది. దాసరిలా.. `మనవాడు` అనిపించుకున్నవాడు.. ఇప్పటికీ కనిపించకపోవడం చిత్రసీమకు ఓ శాపం. ఈమధ్య చిత్రసీమలో చాలా సమస్యలొచ్చాయి. `మా`లో అయితే బోలెడు గొడవలు. ఇలా చిత్రసీమ వీధిన పడిన ప్రతీసారి… `గురువు గారు ఉంటే బాగుణ్ణు` అనుకున్నారంటే – ఆయన విలువేంటో అర్థం చేసుకోవొచ్చు.
విలన్లని హీరోలుగా చేసినప్పుడు, ఏమాత్రం స్టార్ డమ్ లేని వాళ్లతో అద్భుతాలు సృష్టించినప్పుడు, ఆఖరికి ఉదయం పేపర్ పెట్టినప్పుడు… దాసరిలోని డేరింగ్ డాషింగ్తనమే ప్రస్పుటంగా కనిపించింది. సవాళ్లకు ఎదురెళ్లడం, వాటి మెడలు వంచడం దాసరికి మాత్రమే తెలుసు. వన్ అండ్ ఓన్లీ దాసరి అనుకునేది అందుకే.
చాలామంది వస్తారు. కొంతమంది నిలబడి పోతారు. ఒకరిద్దరు చరిత్ర తిరగరాస్తారు. దాసరిలా. వాళ్లకు పుట్టిన రోజులు తప్ప.. జయంతులు వర్థంతులూ ఉండవు. హ్యాపీ బర్త్ డే దాసరి గారూ!