దాసరి నారాయణరావు… తెలుగు చిత్రసీమకు పెద్ద దిక్కు! అలాంటి వ్యక్తి నోటి నుంచి వచ్చే ప్రతీ మాటా… విలువైనదే. పరిశ్రమ కోసం, కార్మికుల కోసం, ఇక్కడి సాధకబాధకాల కోసం చాలాసార్లు గళమెత్తారు.. పరిశ్రమ కోసం పాటుపడ్డారు. సినిమా గురించీ.. ఈ కళ గురించీ.. ఇక్కడి కష్టం గురించీ ఆయనకు సంపూర్ణ అవగాహన ఉంది. కానీ అదంతా ఒక్కోసారి ఎటు పోతోందా?? అనిపిస్తుంటుంది. ఆదివారం జరిగిన ఓకార్యక్రమంలో తెలుగువాళ్ల మనస్తత్వాల గురించి అద్భుతంగా మాట్లాడారు. `మనల్ని మనమే మరుగుజ్జులం చేసుకొంటాం. మన ప్రతిభ మనం గుర్తించం` అంటూ. అంత వరకూ కరెక్టే. కానీ ఆయన టాపిక్ సినిమాలవైపు మళ్లింది. ఇష్టమైన దర్శకుడు ఎవరంటే… బాలచందర్, మణిరత్నం పేర్లు చెబుతారని… మనవాళ్ల గురించి పట్టించుకోరని, ఇష్టమైన సినిమాల జాబితాలో ఇంగ్లీష్ సినిమాలుంటాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సినిమాకి భాష లేదన్నది కళాకారుల నమ్మకం. మణిరత్నం, బాలచందర్ లాంటి దర్శకులు భాషకు అతీతంగానే మెలిగారు. బాలచందర్ని కేవలం తమిళ దర్శకుడిగానే చూస్తామా? మణిరత్నం నుంచి సినిమా వస్తోందంటే అది డబ్బింగ్ సినిమా అనుకొంటామా?? ఆ స్థాయి సినిమాల్ని మనం ఎందుకు తీయడం లేదు? మన దర్శకులెందుకు కమర్షియల్ సినిమాలంటూ వెంట పడుతుంటారు?? కమర్షియల్ సినిమాలు ఫాస్ట్ ఫుడ్ లాంటివి. తింటున్నంత సేపూ బాగుంటాయి. ఆ తరవాత ఆ రుచి మర్చిపోతాం. కళాత్మక చిత్రాలు అమ్మ గోరుముద్దల్లాంటివి. ఎప్పుడైనా సరే… గుర్తుండి తీరాల్సిందే. మరో చరిత్ర, ఆకలి రాజ్యం లాంటి సినిమాలు మర్చిపోతామా? గీతాంజలి చూస్తూ మురిసిపోకుండా ఉండగలమా?? మణిరత్నం చేసిన ఓ సాంగ్ కంపోజీషన్ని ఇంపోజీషన్లా మార్చి మార్చి కాపీ కొట్టి సినిమాల్లో వాడుకోని దర్శకుడు ఉంటాడా?? కె.విశ్వనాథ్ నాకు నచ్చిన దర్శకుడు అంటూ తెలుగోడు కాని కమల్‌హాసన్ ఎన్ని వందలసార్లు చెప్పుంటాడు?? కళకున్న విలువ అలాంటిది. కళాత్మక చిత్రాలకున్న శక్తి అంతటిది. మనమేమో అలాంటి సినిమాలు తీయం. తీసినవాళ్ల గురించి గొప్పగా చెప్పుకోకూడదు అంటే ఎలా?
రాజమౌళి.. రాజమౌళి అంటూ.. దేశం మొత్తం ఓ దర్శకుడి పేరు జపిస్తోందంటే కారణం.. మగధీర, బాహుబలి లాంటి సినిమాలే. ఈ సినిమాలన్నీ ఇంగ్లీషు చిత్రాల స్ఫూర్తే అంటే కాదనేవాళ్లు ఉంటారా? నచ్చిన సినిమా అన్నప్పుడు `అవతార్` లాంటి సినిమాలు గుర్తొస్తున్నాయంటే… మనవాళ్ల ప్రతిభని తక్కువ చేయడం కాదు. అంతటి స్ఫూర్తి రగిలించే చిత్రాలు అక్కడ్నుంచే వస్తున్నాయని. ఈ విషయం దాసరికి తెలియంది కాదు. ఆయన కూడా తమిళ చిత్రాల్ని రీమేక్ చేశారు కదా? అంటే అక్కడి కథల గొప్పదనం గుర్తించే కదా? మనల్ని మనం తక్కువ చేసుకోవడం తెలుగువాడి మూర్ఖత్వంగా ఎలా జమకడుతున్నామో… పక్కవాళ్ల గొప్పదనం మెచ్చకోవడం కూడా అంతే గొప్పదనం అనుకొంటే చాల్లా..???