ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అస్వస్తతకు గురయ్యారు. శ్వాస కోస సంబంధిత సమస్యతో సోమవారం ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. దాంతో దాసరికి ఏమైందంటూ… ఊహాగానాలు వ్యాపించాయి. దాసరికి కీలకమైన ఆపరేషన్ చేయబోతున్నట్టు గాసిప్పులు జోరందుకొన్నాయి. ‘ప్రమాదంలో దాసరి ఆరోగ్యం’ అంటూ పుకార్లు కూడా రేగాయి. అయితే.. దాసరికి ప్రస్తుతం బాగానే ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయన కోలుకొన్నారని, మాట్లాడగలుగుతున్నారని, భయపడాల్సిందేం లేదని సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాసేపట్లో ఆయనకు ఓ కీలకమైన ఆపరేషన్ చేయాలని వైద్యులు నిర్ణయించుకొన్నట్టు సమాచారం. ఆపరేషన్ జరిగాక గానీ ఆయన ఆరోగ్యంపై ఓ పూర్తి క్లారిటీ రాకపోవొచ్చు.
గతేడాది దాసరి ఆరోగ్యం ఏం బాలేదు. ఆయన కొన్నాళ్ల పాటు మీడియాకి కూడా కనిపించలేదు. ఆ తరవాత కోలుకొని.. ప్రెస్ మీట్లు, సక్సెస్ మీట్లకు హాజరవుతున్నారు. తన సంస్థ నుంచి సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. మళ్లీ మెగా ఫోన్ పట్టాలన్న ఉద్దేశంతో కథలను సిద్ధం చేసుకొన్నారు. అయితే ఇంతలోనే ఆరోగ్యం మళ్లీ తిరగబడింది. ఆయన త్వరగా కోలుకోవాలని… మళ్లీ ఎప్పట్లా హుషారుగా కనిపించాలని కోరుకొందాం.