ఎర్రబస్సు సినిమా తరవాత దర్శకత్వం ఊసెత్తలేకపోయారు దాసరి నారాయణరావు. అంతకు ముందు ఆరోగ్యం సహకరించక.. చాలా కాలం ఖాళీగానే ఉన్నారాయన. ఎర్రబస్సు తరవాత ఎలాంటి సినిమా చేయాలి? అనే విషయంలో ఆలోచించడానికే చాలా సమయం తీసుకొన్నారు. మధ్యలో పవన్ కల్యాణ్ కోసం కథలు విన్నారు. ఆ ప్రాజెక్టు విషయంలో రెండేళ్ల నుంచీ ఇప్పటి వరకూ ఒక్క అప్ డేట్ కూడా లేదు. ‘పితృదేవో భవ’ అంటూ ఓ ఇంట్రస్టింగ్ టైటిల్‌తో ఓసారి మీడియా ముందుకొచ్చారు. అయితే ఆ సినిమా ఎప్పుడన్నది దాసరి ఇంత వరకూ చెప్పనేలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థపై, అసెంబ్లీ జరిగే తీరుతెన్నులపై ఓ సినిమా తీస్తానని ఎప్పుడో ఐదారేళ్ల క్రితం ఎనౌన్స్ చేశారు దాసరి. ‘వడ్డీకాసులవాడు’ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారు. కానీ… అది అటకెక్కి చాలాకాలమైంది. ఇప్పుడు తాజాగా ‘అమ్మ’ పేరుని రిజిస్టర్ చేయించారు దాసరి.
అమ్మ అనగానే కచ్చితంగా జయలలిత గుర్తుకురావడం సహజం. సౌతిండియాలో అమ్మ మరణం ఇప్పుడు హాట్ టాపిక్. దాని చుట్టూ జరిగిన రాజకీయాన్ని దాసరి కథగా మలచి ఉంటారేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు రాంగోపాల్ వర్మ ‘శశికళ’ పేరుతో ఓ టైటిల్‌ని రిజిస్టర్ చేయించి ఇండ్రస్ట్రీ వర్గాల దృష్టిని ఆకర్షిస్తే.. దాసరి ‘అమ్మ’ని నమ్ముకొన్నారు. దాసరి అనుభవం, ఆయనకున్న రాజకీయ పరిజ్ఞానంతో ‘అమ్మ’ కథని ఆసక్తిగా మలిచే విషయంలో ఆయనకు పెద్ద సమయం పట్టకపోవొచ్చు. కాకపోతే.. దాన్ని పట్టాలెక్కించడానికి ఎంత సమయం తీసుకొంటారన్నది మాత్రం తేలాల్సివుంది. పబ్లిసిటీ కోసం టైటిల్ ఒకటి రిజిస్టర్ చేయించే స్థాయి కాదు దాసరిది. ఆయన ఓ టైటిల్ అనుకొన్నారంటే కచ్చితంగా దానికి సంబంధించిన కసరత్తులు మొదలయ్యే ఉంటాయి. కాకపోతే… ఇప్పటి వరకూ చాలా సినిమాలు టైటిళ్ల దగ్గరే ఆగిపోయాయి. అందులో ‘అమ్మ’ కూడా చేరిపోతుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కథా రచన, నిర్మాణం దాసరి దగ్గరుండి చూసుకొని, దర్శకత్వం మాత్రం కుర్రాళ్లకు అప్పగిస్తే దాసరి పని సులభం అవుతుంది. అప్పుడుగానీ ఈ టైటిళ్లన్నీ సినిమాలుగా మారే ఛాన్స్ లేదు.