తెలుగు సినిమాకి పెద్ద దిక్కు.. గురువు.. దాసరి నారాయణరావు. మొన్నామధ్య ఆయన తన శిష్యుల్ని, అభిమానుల్నీ, చిత్రసీమనీ కొద్ది రోజుల పాటు కలవరింతకు గురి చేశారు. దాసరి ఆరోగ్యం సడన్గా క్షీణించడంతో ఆయన ఆసుపత్రి పాలవ్వడం, ఆయనకు పలు దఫాలుగా ఆపరేషన్లు నిర్వహించడం, ఆయన కోసం అభిమానులు పూజలు చేయడం, చిత్రసీమ మొత్తం ఆయన ఆరోగ్యంగా బయటకు రావాలని కోరుకోవడం గుర్తుండే ఉంటుంది. దాసరి ఆరోగ్యం మెల్లిమెల్లిగా కుదుటపడినట్టు ఆసుపత్రి వర్గాలు కూడా ధృవీకరించాయి. దాంతో చిత్రసీమ మొత్తం ఊపిరి పీల్చుకొంది.
అయితే ఆయన ఇంకా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాలేదు. ఇంకొన్ని రోజుల పాటు తమ పరివేక్షణలోనే దాసరి ఉండాలని వైద్యులు సూచించార్ట. దానికి దాసరి కుటుంబ సభ్యులూ సమ్మతించడంతో దాసరి ప్రస్తుతం ఆసుపత్రిలోనే చికిత్స తీసుకొంటున్నట్టు తెలుస్తోంది. మరో విషయం ఏమిటంటే.. ఈమధ్యే దాసరికి మరో ఆపరేషన్ కూడా చేశార్ట. అయితే ఆ ఆపరేషన్ ఎందుకు, ఏమిటి? అనే వివరాలు తెలియరాలేదు. కనీసం నెల రోజులైనా దాసరి ఆసుపత్రిలోనే ఉండాలని, ఆ తరవాతే డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపినట్టు సమాచారం. ఆయన త్వరగా కోలుకోవాలని, ఇది వరకటిలా మైకు పట్టుకొని బొబ్బిలిసింహంలా గర్జించాలని మనసారా కోరుకొందాం. గెట్ వెల్ సూన్ గురూజీ..!