మరణానికి కొద్ది రోజులు ముందుగా కొంతమంది కాపు నేతలు దర్శకరత్న దాసరి నారాయణరావును కలుసుకున్నారు. ఆ సందర్భంగా దాసరి కొన్ని కీలకమైన అంశాలపై మాట్లాడినట్టు వారు చెబుతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరుపైనా, కాపుల రిజర్వేషన్ల ఉద్యమం మీదా దాసరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్టు నేతలు చెబుతున్నారు. కాపు కార్పొరేషన్ అందిస్తున్న పథకాలను అందరూ ఉపయోగించుకోవాలని అన్నారట. దాదాపు వెయ్యి కోట్లతో కార్పొరేషన్ వివిధ స్కీములను అందిస్తుంటే వాటిని సక్రమంగా వాడుకోవాలనీ, లేదంటే నిధులు మురిగిపోయి వెనక్కి వెళ్లిన పరిస్థితి వస్తుందని చెప్పారట. అంతేకాదు… గతంలో ఏ ప్రభుత్వమూ కాపు కార్పొరేషన్ కు ఇంత భారీ ఎత్తున నిధులు ఇవ్వలేదనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబును మెచ్చుకోవాల్సిందే అని వ్యాఖ్యానించారట.
కాపులకు చంద్రబాబుతో తీవ్రమైన విభేదాలు లేవనీ, ఆయన రిజర్వేషన్లు ఇస్తామని మనకు మాటిచ్చారనీ, వాటి సాధన కోసమే పోరాటం పరిమితం కావాలి అని దాసరి అభిప్రాయపడ్డారు. ఇదే సందర్భంలో చంద్రబాబు కాపులకు చేస్తున్న మంచి పనుల్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతేకాదు.. చంద్రబాబు తీరు గురించి దాసరి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారని కాపు నేతలు చెబుతున్నారు. చంద్రబాబు ఎవ్వరితోనూ శత్రుత్వం కోరుకునే నాయకుడు కాదనీ, ఒత్తిడి తీసుకొస్తే మాట వినే నైజమూ స్వేచ్ఛ ఆయన దగ్గర ఉన్నాయని దాసరి చెప్పారట. చాలామంది రాజకీయ నాయకులతో పోల్చుకుంటే చంద్రబాబు చాలా బెటర్ అనీ, ప్రతీ విషయంలోనూ కాస్త ఆలోచించి ముందుకు సాగుతారనీ, పార్టీకి మేలు జరుగుతుందంటే పాజిటివ్ గా స్పందిస్తారని దర్శకరత్న మెచ్చుకోవడం విశేషం.
కాపుల రిజర్వేషన్లు సాధించుకునేందుకు ఇదే సరైన తరుణమనీ, ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ రాదని కూడా కాపు నేతలకు దాసరి హితబోధ చేశారని అంటున్నారు. ఏమాటకి ఆ మాట చెప్పుకోవాలనీ, ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఏ ప్రభుత్వమూ చేయదనీ, వీటిని సద్వినియోగం చేసుకుంటే మన పిల్లల భవిష్యత్తు ఎంతో బాగుంటుందని దాసరి అభిప్రాయపడ్డారట. చంద్రబాబుతో ఒక్క రిజర్వేషన్ల విషయంలో తప్ప.. ఇంకెక్కడా విరోధం పెంచుకోవాల్సిన పనిలేదని అన్నారట. ఏ పనిచేయాలన్నా అధికారంలో ఉన్నవారే చేయగలరనీ, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్పారట. కాపులు ఐకమత్యంతో ఉన్నంతకాలమే గౌరవం ఉంటుందనీ, రాజకీయ పార్టీల గుర్తింపూ అండదండలు ఉంటాయనే విషయాన్ని మరచిపోకూడదని దాసరి చెప్పినట్టు కాపు నేతలు వివరిస్తున్నారు. మొత్తానికి, చంద్రబాబు గురించి ఈ తరహాలో దాసరి విశ్లేషించడం ఆసక్తికరంగా ఉంది. అంతేకాదు, ఆయన్ని పార్టీలోకి రమ్మంటూ ఆహ్మానించారని కూడా కాపు నేతలతో దాసరి చెప్పడం విశేషం.