దాసరి నారాయణరావు దగ్గర ఓ ప్రత్యేకత ఉంది. తిట్టినా, పొగిడినా… అది పీక్స్‌లో ఉంటుంది. ఎవరి ఫంక్షన్‌కి వెళ్తే… వాళ్లని ఆకాశంలోకి ఎత్తేస్తుంటారు. బుధవారం… శ్రీకాంత్ నటించిన మెంటల్ పోలీస్ సినిమా ట్రైలర్ లాంచ్ కి అతిథిగా వెళ్లారు దాసరి. అక్కడ శ్రీకాంత్‌ని పొడడ్తలతో ముంచేశారు. ‘శ్రీకాంత్ నా బిడ్డలాంటోడు’ అంటూ రొటీన్‌గానే తన ప్రసంగాన్ని ప్రారంభించిన దాసరి శ్రీకాంత్‌ని వంద కోట్ల హీరో అనడం ఆశ్చర్యంలో ముంచెత్తింది. శ్రీకాంత్ నటించిన టెర్రర్ సినిమాని దాసరి ఇటీవలే చూశారట. అది వంద కోట్ల సినిమా అంటూ అభివర్ణించారు. హిందీలో గనుక ఈ సినిమా తీసుంటే.. కచ్చితంగా వంద కోట్లు వచ్చేవని, ఇప్పటికైనా మించిపోయింది లేదని, హిందీ వాళ్లు రీమేక్ రైట్స్ తీసుకోండని ఆయన సలహా ఇచ్చారు.
దాసరి పొగడ్త తో శ్రీకాంత్ ఉబ్బితబ్బిబ్బి అయిపోయినా.. చుట్టుపక్కల వాళ్లు మాత్రం.. ‘దాసరిగారు మీరు మరీనండీ’ అన్నట్టే చూశారు. ఆర్.నారాయణమూర్తి కూడా దాసరికి తోడుగా గొంతు కలిపారు. శ్రీకాంత్ అంటేనే పెద్ద హీరో అని, ఆయన నటించిన సినిమా చిన్న సినిమా ఎందుకు అవుతుందని ఆయన నిలదీశారు. బాగానే ఉంది ఈ పొగడ్తల యవ్వారం. పాపం.. వంద సినిమాల హీరో శ్రీకాంత్ ఒక్క హిట్టూ లేక తెగ ఇదైపోతున్నాడు. ఈ మెంటల్ పోలీస్ అయినా కాస్త రిలాక్సేషన్ ఇస్తుందేమో చూడాలి.