తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన సినీ దిగ్గజం దర్శక రత్న దాసరి నారాయణరావు ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోంది. ఊపిరి తిత్తుల సమస్యతో సోమవారం కిమ్స్‌లో చేరిన దాసరికి మంగళవారం పలు శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఆపరేషన్ తరవాత ఆయన కోలుకొంటున్నారని, చికిత్సకు బాగా స్పందిస్తున్నారని, ఇప్పుడు వెంటిలేటర్ కూడా తొలగించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఒకట్రెండు రోజుల్లో దాసరి పూర్తిగా కోలుకొనే అవకాశం ఉందని సమాచారం. దాసరి అనారోగ్యం వార్త తెలియగానే ఆయన అభిమానులు, శిష్యగణం, తెలుగు సినీ పరిశ్రమ కలవరపడింది. దాసరి ఆరోగ్యం విషయంపై వాకబు చేసింది. మంగళవారం ఆయన పరిస్థితి కొంచెం విషయంగానే ఉంది. ఏ క్షణాన ఏమవుతుందో అని కంగారుపడ్డారంతా. అయితే ఆపరేషన్ అనంతరం దాసరి ఆరోగ్యం క్రమంగా అదుపులోకి వచ్చింది.
మంగళవారం నుంచి మోహన్ బాబు, కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు. గురువుగారి ఆరోగ్యం గురించి ప్రతి క్షణం వాకబు చేస్తూనే ఉన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా.. డాక్టర్లతో మాట్లాడారు. ‘ఆయన ఆరోగ్యానికి ప్రమాదం లేదు’ అని డాక్టర్లు హామీ ఇచ్చాకనే అక్కడి నుంచి కదిలారు. ఈరోజు ఉదయం కూడా మోహన్ బాబు కిమ్స్‌కి వెళ్లారు. గురువుగారి ఆరోగ్యం విషయంలో తీపి కబురు అందడంతో ఆయన కాస్త తేలిక పడ్డారు. సో.. దాసరి పెను ప్రమాదం నుంచి బయటపడినట్టే.