దాసరి మాటే ఓ సంచలనం. ఆయన నోరు విప్పితే చాలు.. మీడియావాళ్లకు రాసుకోవడానికి బోలెడన్ని వార్తలు. ఈసారీ… దాసరి మాటలు.. హాట్ టాపిక్ అవ్వబోతున్నాయి. ఆయన లేటెస్టుగా దర్శకులందరికీ ఛాలెంజ్ విసిరారు. అయితే ఈసారి సబ్జెక్ట్ సినిమాలు కాదు.. సీరియళ్లు. అవును ఏ టాప్ దర్శకుడైనా ఓ సీరియల్ తీసి, వంద ఎపిసోడ్లు నడిపిస్తే.. ఆ దర్శకుడికి పాదాభివందనం చేస్తారన్నారాయన. దాసరి నిర్మించిన అభిషేకం ధారావాఙిక ఏకంగా 2500 ఎపిసోడ్లు పూర్తి చేసుకొంది. ఈ సందర్భంగా టి.సుబ్బరామిరెడ్డి కళాపరిషత్ అభిషేకం టీమ్ కి అభినందిస్తూ ఓ కార్యక్రమం నిర్వహించింది. ఈ వేడుకలోనే ఈనాటి దర్శకులకు దాసరి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.
అయినా దాసరి పిచ్చిగానీ.. టాప్ దర్శకుడు సినిమాలతో బిజీగా ఉంటాడు గానీ, సీరియళ్లు ఎందుకు తీస్తాడు? సినిమాలు లేక, రిటైర్ అయిపోయి, ఖాళీగా ఉన్న దర్శకులే బుల్లితెరపైపు అడుగులు వేయడం లేదు. అలాంటిది.. స్టార్ దర్శకులు సీరియళ్ల గురించి ఎందుకు పట్టించుకొంటాడు. ఇక్కడ మరో గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… దాసరి కూడా అభిషేకం సీరియల్ కి డైరెక్ట్ చేయలేదు. జస్ట్ నిర్మించారంతే. ఈ ధారవాహిక 2500 ఎపిసోడ్లు పూర్తి చేసుకొంది గానీ.. దాదాపు పదిమంది దర్శకులు మారారు. దాసరికి సీరియళ్లపై అంత ప్రేమ ఉంటే.. ఆయనే డైరెక్టు చేయొచ్చుగా..? టాప్ దర్శకుల్ని గురి పెట్టాల్సిన అవసరం ఏముంది? ప్రస్తుతం బుల్లి తెరపై ధారావాహికల జమానా కూడా అయిపోయింది. ఇప్పుడంతా రియాలిటీ షోల హంగామానే. లేదంటే జబర్దస్త్లా ఓ బూతు కామెడీ చూపించాలి. సీరియళ్లని నమ్ముకొంటే అంతే సంగతులు. ఈ విషయం దాసరికి తెలియంది కాదు. మరి ఎందుకంత ఆవేశపడిపోయారో ఏంటో..??