సినిమా రంగానికి చెందిన దాసరి నారాయణ రావుకి, రాజకీయాలలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఏమిటి సంబంధం? అంటే ఏమీ లేదనే చెప్పుకోవచ్చు. కానీ దాసరి కాంగ్రెస్ ఫ్లాష్ బ్యాక్, ఆయనకి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డితో ఉన్న సన్నిహిత సంబందాలు వారిద్దరి మధ్య లింక్ ఏర్పరిచింది. ఐదు నెలల క్రితం జగన్ దాసరి ఇంటికి వెళ్లిరావడం, ఆ తరువాత కాపులకు రిజర్వేషన్లు కోరుతూ ముద్రగడ పద్మనాభం మొదలుపెట్టడం, దానికి దాసరి నేరుగా, జగన్ పరోక్షంగా మద్దతు పలకడంతో వారు ముగ్గురు కలిసే ఆ ఉద్యమానికి ప్రాణం పోశారని తెదేపా నేతలు అభిప్రాయపడుతున్నారు. ముద్రగడ కిర్లంపూడిలో ఆమరణ నిరాహార దీక్షకి కూర్చొన్నప్పుడు, దాసరి ఆయనను పరామర్శించడానికి బయలుదేరడం, ఆయనని పోలీసులు అడ్డుకొన్నప్పుడు అందుకు ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం వంటి పరిణామాలు వారి వాదనలకు బలం చేకూర్చుతున్నట్లున్నాయి. అయితే దాసరి నారాయణ రావు దానిని ఖండించారు.
ఆయన నిన్న హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ “జగన్మోహన్ రెడ్డి ఒక డైనమిక్ లీడర్. తను అనుకొన్నది సాధించగల నేర్పు, పట్టుదల ఉన్నవాడు. జగన్ కేవలం నా ఆశ్వీర్వాదం తీసుకోవడానికి మాత్రమే వచ్చేరు తప్ప ఆ ఉద్యమం గురించి నాతో చర్చించడానికి రాలేదు. తెదేపా తన ఎన్నికల మ్యానిఫెస్టోలో కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి దానిని నిలుపుకొనందుకే ఆ ఉద్యమం మొదలయింది తప్ప నేనో, జగనో వెనుక నుండి ప్రోత్సహించడం వలన కాదు,” అని దాసరి చెప్పారు.
జగన్మోహన్ రెడ్డితో తనకు రాజకీయంగా ఎటువంటి రాజకీయ సంబంధమూ లేదనట్లు మాట్లాడుతున్న దాసరి నారాయణ రావు వైకాపా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల గురించి స్పందించడం విశేషం. పార్టీ మారాలనుకొన్న వారు ముందుగా తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని ఆయన సూచించారు. ప్రస్తుతం దాసరి నారాయణ రావు రాజకీయాలకు దూరంగా ఉంటునప్పటికీ, ఆయనకి వాటిపై ఇంకా వ్యామోహం తగ్గలేదని ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాగూ భవిష్యత్ అంధకారంగా కనిపిస్తోంది కనుక అయన ఏదో ఒకరోజు వైకాపాలో చేరినా ఆశ్చర్యం లేదు. ముద్రగడ, ఆయన చేపట్టిన ఉద్యమం వారి ముగ్గురి మధ్య వారధిగా నిలుస్తున్నట్లు కనిపిస్తోంది కానీ వారు ముగ్గురూ కూడా ఒకరితో మరొకరికి సంబంధం లేదన్నట్లుగా మాట్లాడటమే చాలా విచిత్రంగా ఉంది.