బొగ్గు కుంభకోణంలో దర్శకరత్న దాసరి నారాయణరావుపై చార్జిషీటు దాఖలు చేయాలని నిర్ణయించడం నిస్సందేహంగా ఒక కళంకమే. ఈ వార్తలో ఆయన పేరు వచ్చినప్పుడే తెలుగు పత్రికలు, చానళ్లు బొబ్బిలిపులి కాదు- బొగ్గుల పులి అని శీర్షికలిచ్చాయి. నిజంగా ఇది ఆయన ప్రతిష్టకు ఒక మచ్చ. రాజకీయ నాయకులు చాలామందిపై ఏవో ఆరోపణలు వచ్చిన మాట నిజమే గాని సినిమా రంగంనుంచి వెళ్లి ఎఫ్ఐఆర్కు ఎక్కింది మాత్రం బహుశా దాసరి మాత్రమే! ఎన్టీఆర్‌పై ఎవరు ఎన్ని విమర్శలు చేసినా అవినీతి ఆపాదించలేకపోయారు. కాంగ్రెస్ నేత ద్రోణంరాజు సత్యనారాయణ వేసిన కేసులో హైకోర్టు కొన్ని నిర్దారణలు చేసినా తర్వాత వాటికి పెద్ద విలువ లేకుండా పోయింది. హీరో కృష్ణం రాజు కేంద్ర మంత్రిగా వున్నారు గాని ఎలాటి వివాదాల్లో చిక్కుకోలేదు. చిరంజీవి పార్టీని ఏర్పాటు చేసి విజయం అందుకోలేక విలీనం చేశారే తప్ప వ్యక్తిగతంగా కేసులపాలు కాలేదు. పిఆర్పి టికెట్ల పంపిణీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలున్నా నిలవలేదు. జాతీయంగానూ శతృఘ్నసిన్హా, రాజేష్‌ఖన్నా,వంటివారు కూడా ఏ గొడవలు లేకుండా బయిటపడ్డారు. మిలీనియం స్టార్ అమితాబ్ బచన్ పేరు బోఫోర్సులోనే వినిపించాక ఎంపి పదవి కూడా వదులుకున్నారు. మళ్లీ ఇటీవల పనామా పత్రాల్లో వార్తలకెక్కారు గాని ఇది రాజకీయం కన్నా ఆర్థిక ఆరోపణగానే వుంటుంది. తమిళనాడులో జయలలిత నటిగా కన్నా ముఖ్యమంత్రిగానే కుంభకోణాలలో పేరుమోశారు.నాగార్జున,కృష్ణ తదితరుల భూములకు సంబంధించి సమస్యలున్నాయి గాని కుంభకోణాలు కాదు. అవి కూడా పరిష్కారం చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించి వున్నారు.అలాచూస్తే సినిమా రంగం నేపథ్యంలో రాజకీయ ప్రవేశం చేసి ఒక కుంబకోణంలో కేసులో చిక్కినవారు దాసరే అని చెప్పొచ్చా? ఈ కారణంగానే ఆయన ఆవేదనలు ఆగ్రహాలు కూడా ఈ మధ్య కాస్త డొల్లగా కనిపిస్తున్నాయి.