చిరంజీవిని జాతీయ ఉత్తమ నటుడిగా చూడాలని ఎంతోమంది కోరిక. ఇలా కోరుకున్న వారి దర్శకరత్న దాసరి కూడా వున్నారు. ఓ సందర్భంలో చిరంజీవిని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు దాసరి. ఆ సమయంలో జాతీయ అవార్డ్ ప్రస్తావన వచ్చింది.
దాసరి: అతి తక్కువు కాలంలో తెలుగు చలనచిత్ర రంగంలో ఏ కథానాయకుడు పొందనంత ‘స్టార్డమ్’ను పొందావు. నువ్వు జాతీయ ఉత్తమ నటుని అవార్డును తీసుకుంటే చూడాలని వుంది. నా కోరిక నెరవేరుతుందా?
చిరంజీవి: మీరు ఏమైనా అనుకోండి, అవార్డులు పొందాలి, అవార్డులు సంపాదించుకోవాలి అనే తపన నాలో చాలా తక్కువ. ఇంకా చెప్పాలంటే ఆ ధ్యాసే నాలో వుండదు. దానంతట అదిగా అవార్డు వస్తే నిజంగా అది ఆనందం, గర్వంగాను వుంటుందన్న మాట వాస్తవం. అయితే అవార్డులకంటూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి, ప్రత్యేకమైన సినిమాల్లో నటించాలనే ఆలోచన లేదు. కారణం అవార్డులకంటే ఎంతో విలువైన ప్రజాభిమానాన్ని ఇంతకు అంత సంపాదించాలని, దానిని ఎలా నిలబెట్టుకోవాలా అని మాత్రం ఎల్లవేళలా ఆలోచిస్తూ దానికి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాను. నేను జాతీయ అవార్డు తీసుకోవాలని మీలాంటి పెద్దలు అంత బలమైన కోరికతో వున్నందుకు ఏదో ఒకనాటికి, అది ఆశీస్సులై నెరవేరుతుందేమో!’ అని చెప్పుకొచ్చారు మెగాస్టార్.
నిజానికి కమర్షియల్, మాస్ మాసాలా సినిమాల్లో పడి అభిమానులని అలరించడమే లక్ష్యంగా పెట్టుకొని సినిమాలు చేశారు, చేస్తున్నారు చిరు. అయితే ఇదే సమయంలో ఆయనలోని గొప్ప నటుడుకి అన్యాయం జరుగుతోందని చాలా మంది అభిప్రాయపడతారు. ఆయన నటవిశ్వరూపానికి సాక్ష్యంగా ఆపద్భాందవుడు, స్వయంకృషి, రుద్రవీణ, సినిమాలని చూపుతారు. కానీ ఇవేవీ కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు. దీంతో అలాంటి సహజసిద్దమైన కథలవైపు చూడలేదు మెగాస్టార్. అయితే ఇప్పుడు జనరేషన్ మారింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు కోరుకుంటున్నారు ఫ్యాన్స్. కమర్షియల్ సినిమాలకూ అవార్డులు వస్తున్నాయి. అవార్డ్ కొట్టడమే లక్ష్యంగా ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తే దాసరితో పాటు అభిమానులు కోరిక తీరడం కష్టం కాదనే చెప్పాలి.