రాక రాక వచ్చిన ఎమ్మెల్సీ పదవి చేజారిపోతుందని తెలిసిన తర్వాత దాసోజు శ్రవణ్ చేయని పోరాటం లేదు. ఒక్క శాతం కూడా చాన్స్ లేనప్పటికీ ఆశలు వదులుకోకుండా తన ప్రయత్నం తాను చేస్తున్నారు. తాజాగా తెలంగాణ కేబినెట్ మరోసారి కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను గవర్నర్‌కు సిఫారసు చేసింది. గతంలో వీరి పేర్లను సిఫారసు చేస్తే గవర్నర్ తమిళిసై ఆమోదించారు. గెజిట్ కూడా విడుదల అయింది. కానీ హైకోర్టు కొట్టి వేసింది.
కేసీఆర్ హయాంలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను సిఫారసు చేశారు. కానీ గవర్నర్ తిరస్కరించారు. కేసీఆర్ మళ్లీ సిఫారసు చేయలేదు. ఈ లోపు ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ గెలిచింది. తమకు చాన్స్ రావడంతో తమ నేతల్ని సిఫారసు చేసుకున్నారు. అయితే గవర్నర్ నిర్ణయం తప్పని ఎమ్మెల్సీ పదవులు తమకే రావాలని దాసోజు శ్రవణ్ కోర్టుకెళ్లారు. కోర్టు గవర్నర్ నిర్ణయం తప్పని చెప్పగలిగింది కానీ మళ్లీ వీరినే సిఫారసు చేయాలని ఆదేశించలేదు.
Also Read : దాసోజు శ్రవణ్… రాజకీయ దురదృష్టవంతుడు !
కాంగ్రెస్ ప్రబుత్వం మళ్లీ కోదండరాం, అమీర్ అలీ ఖాన్లనే సిఫారసు చేయడంతో కొత్త గవర్నర్ కు లేఖ రాశారు. తాము సుప్రీంకోర్టును ఆశ్రయించామని అందుకే ప్రభుత్వ సిఫారసులు ఆమోదించవద్దని కోరారు. ఎలా చూసినా పాత ప్రభుత్వం సిఫారసుల ఆమోదించాలని సుప్రీంకోర్టు కూడా చెప్పదని దాసోజు శ్రవణ్‌కు కూడా తెలుసు. అయినా ఆయన పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే ఆ ఎమ్మెల్సీలు ఖాళీ అయి రెండేళ్లు అవుతోంది.