కాంగ్రెస్ పార్టీకి దాసోజు శ్రవణ్ రాజీనామా చేశారు. తన రాజీనామాకు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్‌ను హస్తగతం చేసుకునేందుకు.. వ్యక్తిగత ఈమేజ్ పెంచుకునేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారంటూ దాసోజు విమర్శించారు. ఆయన సొంత ముఠాను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కులం, ధనం ప్రధానం అయ్యాయని పేర్కొన్నారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానన్నారు. సర్వేల పేరుతో తప్పుడు నివేదికలు ఇచ్చి మోసం చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి, సునీల్, మాణిక్కం ఠాగూర్‌లు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని ..సర్వేల పేరుతో రాజకీయ జీవితాల్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు.
దాసోజు శ్రవణ్ ప్రజారాజ్యంపార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆ పార్టీలో కీలకపాత్ర పోషించారు. కానీ తెలంగాణ ఉద్యమం సమయంలో..పీఆర్పీ సమైక్యాంధ్ర స్టాండ్ తీసుకోవడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్లో చేరారు. ఆ పార్టీలో చాలా కాలం యాక్టివ్‌గా పని చేశారు. కానీ ఎన్నికల్లో టిక్కెట్ లభించలేదు. ఆయన సామాజికవర్గం బలంగా ఉన్న నియోజకవర్గం లేదని చెప్పి పక్కన పెట్టారు. దీంతో అసంతృప్తికి గురైన ఆయన టీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
మంచి వాగ్దాటి ఉన్న దాసోజు శ్రవణ్‌కు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లభించింది. ఆయనకు గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి టిక్కెట్ ఇచ్చారు. అక్కడ పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ నుంచి పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే సమయంలో దాసోజు శ్రవణ్‌కు టిక్కెట్‌పై పార్టీ పెద్దల నుంచి హామీ లభించలేదు. దీంతో బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపారు. గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆయన రేవంత్‌పై రాళ్లేసి వెళ్లిపోతున్నారు.