వివేకా హత్యకేసులో త్వరలో నిజాలు తెలనున్నాయని, వాస్తవాలు బయటపడే రోజు దగ్గర పడిందని దస్తగిరి అన్నారు. ఇప్పటి వరకూ దస్తగిరి చెప్పింది అబద్దమని అన్నారని, ఇకపై తాను చెప్పిన నిజాలు ఏంటో ప్రజలకు తెలుస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్ లో విచారణకు సీఎం జగన్ సహకరించి ఉంటే 10 రోజుల్లో కేసు విచారణ పూర్తి అయ్యేదన్నారు. తెలంగాణకు వివేకా హత్య కేసు బదిలీ అవ్వడం మంచిదేనన్నారు.
కేసు హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ కావడంతో కోర్టు ఎదుట హాజరు కావాలని సమన్లు వచ్చాయి. వాటిని తీసుకునేందుకు సీబీఐ అధికారుల్ని కలిశారు దస్తగిరి. ఈ నెల 10న హైదరాబాద్ సీబీఐ కోర్టుకు హాజరు కావాలని నోటీసులు అందుకున్నట్లు ఆయన తెలిపారు. సీబీఐ అధికారులు పక్కా సమాచారంతో ఈ కేసులో సంబంధం ఉన్న వారిని విచారణకు పిలుస్తున్నారన్నారు. అందులో భాగంగానే వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా విచారణకు పిలిచారన్నారు. ఈ కేసులో ఎవరి పాత్ర ఏంటో సీబీఐ అధికారులు త్వరలోనే వెల్లడిస్తారని నమ్ముతున్నట్లు దస్తగిరి ఆదివారం అన్నారు.
వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు.. ఎంపీ అవినాశ్ రెడ్డి కాల్ డేటాను ఆధారంగా సీబీఐ విచాణ జరుపుతోంది. త్వరలో కీలక వ్యక్తులను విచారణకు పిలువనున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసు విచారణలో రాజకీయంగానూ సంచలనం అయ్యే అవకాశాలు ఉండటంతో సీబీఐ అధికారులు ఎప్పుడు ఏ విధంగా ముందుకెళ్తారన్నదానిపై ఉత్కంఠ ఏర్పడింది.