వివేకా హత్య కేసు లో అప్రూవర్ గా మారిన దస్తగరి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు లాయర్ ను పెట్టుకునే స్థోమత లేదని..అందుకే న్యాయసహాయం చేయాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాలు చేస్తూ చనిపోయినంత వరకూ వివేకా పీఏగా ఉన్న ఎంవీ కృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై దస్తగిరికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో తనకు న్యాయ సహాయం కావాలని కోరుతూ దస్తగిరి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
న్యాయవాదిని పెట్టుకునేంత ఆర్ధిక స్థోమత తనకు లేనందున న్యాయవాదిని కల్పించాలని దస్తగిరి సుప్రీంకోర్టును కోరాడు. దీనిపై సోమవారం అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని సునీత దాఖలు చేసిన పిటిషన్ తో పాటు విచారణ జరిగే అవకాశం ఉంది. వివేకాను చనిపోయిన తర్వాత మొదటగా చూసింది కృష్ణారెడ్డినే. దారుణ హత్యకు గురైనా ఆ విషయాన్ని చెప్పలేదు. దీంతో ఇటీవల దాఖలు చేసిన చార్జిషీట్లో సీబీఐ వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డిని, వివేకా ఇంట్లో వంట మనిషి లక్ష్మి కుమారుడు ఏదుల ప్రకాశ్‌ను అనుమానితులుగా చేర్చారు.
హత్యకు అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి డబ్బులిస్తారని.. సాక్ష్యాలేవీ లేకుండా చూసుకుంటారని.. మనకు భయం లేదని గంగిరెడ్డి భరోసా ఇచ్చినట్లు దస్తగిరి తన అప్రూవర్ స్టేట్మెంట్లో తెలిపినట్లు సీబీఐ వెల్లడించింది. ‘డబ్బు ఇవ్వడంతోపాటు హత్య తర్వాత కేసు పెట్టకుండా ప్రయత్నాలు చేయడం.. రక్తాన్ని కడిగేయడం, గాయాలు కనిపించకుండా బ్యాండేజీలు వేసి పూలతో అలంకరించడం వంటివన్నీ కుట్రలో భాగంగానే జరిగాయి’ అని తెలిపింది. నిందితుల పాత్రను నిరూపించేలా కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజీలు, గూగుల్ టేకౌట్, వివేకా ఇంటిలోని వైఫైకి సంబంధించిన సమాచారం, ఎఫ్ఎస్ఎల్ నివేదికలు, నిపుణుల అభిప్రాయాలు సహా భారీ డేటాను సమీకరించినట్లు వెల్లడించింది. ఈ కేసులో కీలక మలుపులు సోమవారం విచారణలో చోటు చేసుకునే అవకాశం ఉంది.