అప్రూవర్‌గా మారిన దస్తగిరి కూడా పెద్ద ఎత్తున ప్రలోభాలు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆయన అప్రూవర్‌గా మారిన తర్వాత క్షమాభిక్ష బెయిల్ ఇచ్చారు. ఈ కారణంగా దస్తగిరి బయటే ఉన్నారు. ఈ సందర్భంగా ఆయనను వివేకా హత్య కేసులో అనుమానితులు పెద్ద ఎత్తున భూమి, డబ్బు ఆఫర్ చేశారు. పది ఎకరాల భూమి, ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తామని ప్రలోభ పెట్టినట్లుగా దస్తగిరి సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా భరత్ యాదవ్ తరపు లాయర్ తనను పిలిచి మాట్లాడారని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది.
అయితే దస్తగిరిని అప్రూవర్‌గా అంగీకరించిన తర్వాత ఆయన పులివెందులలో స్వేచ్చగా తిరిగేలా అవకాశం ఇచ్చి ఆయనకు ఏమైనా బెదిరింపులు.. ఆఫర్లు వస్తాయేమోనని సీబీఐ అధికారులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ నిఘాలోనే కీలక ఆధారాలు సీబీఐ అధికారులకు లభించాయని.. తెలుస్తోంది. ఈ కారణంగానే దస్తగిరి కేసు పెట్టారని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే అప్రూవర్‌ను ప్రలోభపెట్టబోయి మరోసారి వివేకా హత్య కేసు నిందితులు అడ్డంగా బుక్కయ్యారన్న ప్రచారం జరుగుతోంది. మరో వైపు పులివెందులలో విచారణ అంత సేఫ్ కాదని డిసైడయిన సీబీఐ అధికారులు కడప కేంద్రంగా విచారణ చేయాలని నిర్ణయించారు.
హత్య కేసు పులివెందుల కోర్టు నుండి కడప జిల్లా కోర్టుకు బదిలీ చేయాలని సీబీఐ అధికారులు పెట్టుకున్న అభ్యర్థన మేరకు కేసును కడప జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ పులివెందుల కోర్టు మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి వివేకా హత్య కేసు విచారణ, రిమాండ్, వాయిదాలు, బెయిలు అంశాలు అన్నీ కడప జిల్లా కోర్టులోనే జరగే విధంగా ఆదేశించారు. ఇప్పటికే రెండో సారి దస్తగిరి అప్రూవర్‌గా స్టేట్మెంట్ ఇవ్వడంతో త్వరలో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.