మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్ లో మాట్లాడారు. మొత్తం తన వాళ్లు చెప్పినట్లుగా చేస్తే ఏ సమస్యా రాకుండా చూసుకుంటానని భరోసా ఇచ్చారు. ఈ విషయాన్ని దస్తగిరి తన సీబీఐ స్టేట్ మెంట్లో చెప్పారో లేదో కానీ.. మీడియాతో చెబుతున్నారు.
వివేకా హత్య కేసులో జగన్ వ్యవహారశైలి మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉంది. సాక్షి మీడియాలో గుండెపోటు అని ప్రచారం చేయడం దగ్గర్నుంచి ఆయన హత్య అని తెలిసిన తర్వా త కూడా రోడ్డు మార్గంలో కడపకు వెళ్లడం వరకూ .. మొత్తం గూడుపుఠాణి ఉందన్న అనుమానాలున్నాయి. అలాగే హత్య జరిగిన వెంటనే.. ఎవరికీ తెలియక ముందే పనైపోయిందని భారతికి తెలిసిందని .. అజేయకల్లాం వాంగ్మూలం ఇచ్చారు. అన్ని డాట్స్ కలుపుతూ పోతే ఈ కేసు జగన్ దగ్గరకే చేరుతుందన్న అనుమానాలు చాలా కాలం వ్యక్తమవుతున్నాయి.
ఇప్పుడు దస్తగిరి అదే చెబుతున్నారు. వివేకా హత్యకేసు దర్యాప్తునకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. చివరికి ఓ నిందితుడ్ని సీబీఐ అరెస్టు చేయలేకపోవడం అనే విచిత్రం కూడా ఈ కేసులోనే చోటు చేసుకుంది. జూన్ నాలుగో తేదీ తర్వాత .. వివేకా హత్య కేసులో ఎవరూ ఊహించని పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అన్ని వేళ్లూ జగన్ వైపు చూపించేలా పరిణామాలు మారుతున్నాయి.