హైదరాబాద్: మహారాష్ట్రలోని షోలాపూర్ రైతులు హార్టీకల్చర్‌లో కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఎడారి ప్రాంతాలలో పండే ఖర్జూరాలతో పాటు దానిమ్మలను పండించటమే కాక, ఖర్జూరాలనుంచి కల్లును, దానిమ్మనుంచి వైన్‌ను తయారు చేస్తున్నారు. ఖర్జూరంతో ఆరోగ్యానికి ఎంత ప్రయోజనమో, ఆ చెట్టునుంచి వచ్చే కల్లూ అంతే ఆరోగ్యమని చెబుతున్నారు. ఈ కల్లును లీటర్ రు.500 చొప్పు అమ్ముతున్నారు. మరోవైపు దానిమ్మ పండ్ల నుంచి వైన్‌ను తయారు చేసే పరిజ్ఞానాన్ని మహారాష్ట్రలోని పరిశోధనాసంస్థలు అభివృద్ధి చేశాయి. ఆ పరిజ్ఞానాన్ని ఉపయోగించి షోలాపూర్ రైతులు వైన్ తయారుచేస్తున్నారు. దీనిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దానిమ్మ వైన్‌తో చర్మ సౌందర్యం ఇనుమడిస్తుందని చాలా మంది సినిమా హీరోయిన్లు బాగా తాగుతున్నారని రైతులు చెబుతున్నారు. వీరు దానిమ్మ ఆయిల్‌ను కూడా తయారు చేస్తున్నారు. దీని ధర లీటర్‌కు రు.58 వేలు పలుకుతోంది. ఇలా ఖర్జూరపు కల్లు, దానిమ్మ వైన్, ఆయిల్‌తో షోలాపూర్ రైతులు పెద్ద ఎత్తున లాభాలు ఆర్జిస్తున్నారు.
షోలాపూర్ ప్రాంత వాతావరణం, నేలల స్వభావం, వర్షపాతం వంటివన్నీ తెలంగాణ ప్రాంతాన్ని పోలి ఉండటంతో ఇక్కడ కూడా ఆయా పంటల సాగును ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యానవనశాఖ అధికారులు నిర్ణయించారు. ఇటీవల ఒక అధికార బృందం షోలాపూర్‌లో పర్యటించి వచ్చింది. మహారాష్ట్ర పరిశోధనాకేంద్రంలో అభివృద్ధి చేసిన దానిమ్మ రకం మొక్కలను ముందుగా ఉద్యానవన శాఖకు చెందిన వికారాబాద్ నర్సరీలో ప్రయోగాత్మకంగా పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు 5,500 మొక్కలను కొనుగోలు చేశారు. దానిమ్మ, ఖర్జూరంతో పాటు జామ, సీతాఫలం, యాపిల్ బేర్ తదితరాలను తెలంగాణ భూముల్లో విరివిగా పండించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.