రాజకీయాలకు అతీతంగా ప్రతీయేటా అలయ్ బలయ్ ను నిర్వహిస్తూ ఉంటారు భాజపా సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. గత పదమూడేళ్లుగా అలయ్ బలయ్ నిర్వహిస్తూనే ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల్నీ దీనికి ఆహ్వానిస్తుంటారు. ఈ ఏడాది కూడా ఇలానే అందర్నీ పిలిచారు! కాకపోతే.. వచ్చిన నేతలంతా దత్తన్నను ఓదార్చడానికే ప్రాధాన్యత ఇవ్వడం విశేషం! నిజానికి, వచ్చినవారు ఓదార్చారా.. లేదా, ‘బీసీ నేతకు జరిగిన అన్యాయం’ అంటూ ఆయన్ని రెచ్చగొట్టారా అనేదే ఇప్పుడు చర్చనీయం అవుతోంది!
ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా దత్తన్న మంత్రి పదవి పోయిన సంగతి తెలిసిందే. తెలంగాణకు ఉన్న ఒక్కగానొక్క మంత్రి పదవిని కూడా కేంద్రం తీసేసింది అంటూ రాష్ట్రంలోని ఇతర పార్టీ నేతలు కొంత ఆవేదన వ్యక్తం చేశారు. తనను పదవి నుంచి తప్పించడంపై దత్తన్న కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారంటూ కథనాలు వచ్చాయి. కేవలం పనితీరు బాగులేదన్న ప్రాతిపదికనే దత్తన్న పదవి పోయిందని కూడా చర్చ జరిగింది. అయితే, దీని ప్రభావం రాష్ట్ర భాజపాపై పడేలా ఉందనే స్పష్టత కేంద్రానికి వచ్చిందని చెప్పాలి. అందుకే, కంటి తుడుపు చర్యల్లో భాగంగా ఆయనకు గుర్తింపు ఉంటుంది అంటూ ఇప్పుడు భాజపా నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో అలయ్ బలయ్ జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన సీనియర్ నేతలు వీ హనుమంతరావు, మంత్రి నాయని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.
పదమూడో సంవత్సరం దత్తన్నకు కలిసిరాలేదని వీహెచ్ అన్నారు. బీసీకి మంత్రి పదవి దక్కడంతో తామెంతో సంతోషించామనీ, కానీ అది మూణ్నాళ్ల ముచ్చటగా మారిపోయిందనీ, ఇలా చేయడం దారుణం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఆయన ఎంతో చేశారనీ, బీసీ అనే కారణంగానే ఆయన్ని పక్కన పెట్టేశారన్నారు. మంత్రి నాయని మాట్లాడుతూ… దత్తన్న అంచలంచెలుగా ఎదిగారనీ, ఈ రోజు పదవి లేకున్నా అలయ్ బలయ్ అద్భుతంగా నిర్వహించారనీ, ఆయన కోసం నేతలందరూ వస్తారని ఆయన చెప్పారు. ఇలానే, అక్కడికి వచ్చిన ప్రముఖ నేతలంతా దత్తన్న పదవి అంశాన్ని ప్రస్థావించి, తమదైన ఓదార్పు మాటలు పలికారు! అయితే, ఇదే కార్యక్రమానికి వచ్చిన కేంద్ర సహాయ మంత్రి హన్స్ రాజ్ స్పందించారు. దత్తన్న ఎక్కడా ఎలాంటి అన్యాయం జరగలేదనీ, త్వరలోనే ఆయనకు సముచిత గుర్తింపు లభిస్తుందంటూ భాజపా తరఫు వాదన వినిపించారు.
నిజానికి ఇది అలయ్ బలయ్ కార్యక్రమం. రాజకీయాలకు అతీతంగా జరిగేది. పార్టీలకు అతీతంగానే నాయకులు వచ్చారు. అయితే, ఇదేదో దత్తన్న పదవి పోయిన తరువాత, తనకున్న మద్దతును ప్రదర్శించుకునే వేదికగా ఈ సభను మార్చేశారు. వచ్చినవాళ్లంతా ఒకే అంశాన్ని ప్రస్థావించడంతో… ఈ సభపై భాజపా కూడా దృష్టి సారించిందని చెబుతున్నారు. కోసమెరుపు ఏంటంటే.. నేతలంతా ఇలా ఓదార్పుగా మాట్లాడినా, తన పదవి గురించి ప్రసంగంలో దత్తన్న ప్రస్థావించకపోవడం.