కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ టిఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం తెలంగాణలో కొత్త పరిణామం. బిజెపి రాష్ట్ర నాయకత్వం కెసిఆర్ విధానాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నా దత్తన్న మాత్రం రాష్ట్ర ప్రభుత్వంతో చెట్టపట్టాలు కట్టి తిరుగుతున్నారనే విమర్శ చాలా కాలంగా వుంటున్నది. దానికి తగినట్టే ఆయన కూడా వీలు దొరికినప్పుడల్లా అధికార కార్యక్రమాల్లో సానుకూల వ్యాఖ్యలు చేస్తూ కెసిఆర్ ప్రభుత్వ నేస్తంగాపేరు తెచ్చుకున్నారు. ఇటీవలి కాలంలో డా.కె.లక్ష్మణ్ బిజెపి రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వంపై దూకుడు పెంచారు. అంతేగాక తాము రాజకీయంగా పెరగబోతున్నామనే నమ్మకం కలిగించేందుకు తంటాలు పడుతున్నారు.ఇలాటి తరుణంలో కేంద్ర మంత్రిగా వున్న దత్తన్న మాటిమాటికి మంచి మాటలతో కెసిఆర్‌ను ఆకాశానికెత్తుతుంటే తాము ఇబ్బందిలో పడుతున్నామనేది టిబిజెపి నేతల ఆవేదన ఆగ్రహం కూడా. మరీ ముఖ్యంగా యువ నాయకులైతే ఆయన పేరు చెబితే మండిపడే పరిస్థితి కూడా కొన్ని సందర్భాల్లో కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో సాక్షాత్తూ జాతీయ అద్యక్షుడు అమిత్ షా వచ్చి వెళ్లడం, తర్వాత వెంకయ్య నాయుడు, మనోహర్ ఫరిక్కర్ వంటి వారి మాటలు ఇవన్నీ కూడా క్రమేణా బిజెపి దూకుడు పెంచాలనే పిలుపునకు ప్రతిబింబాలుగా వున్నాయి. నిజంగా బిజెపి ఇప్పటికిప్పుడు తెలంగాణలో అంతగా పెరిగేందుకు అవకాశం వుందా అనేది పెద్ద ప్రశ్నే. హైదరాబాదులోనూ ఉత్తర తెలంగాణలోని కరీం నగర్ నిజామాబాద్‌లలోనూ కొంత ప్రభావం వున్నా టిఆర్ఎస్ వాటిని హస్తగతం చేసుకోవడం చూశాం. వాటిని మళ్లీ రాబట్టుకోవడమే గాక మోడీ ప్రభుత్వ మోతను ఆధారం చేసుకుని తెలుగుదేశంతో తెంచేసుకుని స్వంతంగా ముందుకు పోవాలన్నది బిజెపి ఆశ, ఆరాటం. ఎట్టకేలకు దతాత్రేయ కూడా ఈ పంథాలోకి వచ్చారని ఇటీవల ఆయన చేస్తున్న విమర్శలు చెబుతున్నాయి. అధికార కార్యక్రమాలు కూడా టిఆర్ఎస్ ఖాతాలోకి పోకుండా కమలంకు దక్కేట్టు చూడాలన్నది ఆయనపై రెండవ తరహా వత్తిడి. బహుశా రాబోయే రోజుల్లో అలాటి జాగ్రత్తలు కూడా తీసుకోవచ్చు. తమాషా ఏమంటే టిబిజెపిలో దత్తన్న మాత్రమే గాక టిఆర్ఎస్ పట్ట మెతకగా వుండే శాసనసభ్యులు ఒకరిద్దరి పేర్లు వినిపిస్తుంటాయి. మరి వారిని కూడా దారికి తెస్తారా అని అంతర్గత విమర్శకులు అడుగుతున్నారు. చూడాలి.