శివసేన వ్యవస్థాపకుడు, దాని అధ్యక్షుడు బాల్ థాకరేని హత్య చేయడానికి తను, మరొక వ్యక్తి కలిసి రెక్కి నిర్వహించమని, పాక్-అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ ఇవ్వాళ్ళ విచారణలో బయటపెట్టాడు. ముంబై 26/11 దారులలో నిందితుడయిన డేవిడ్ హెడ్లీ ప్రస్తుతం అమెరికాలోని ఒక గుర్తుతెలియని రహస్య ప్రదేశంలో 35సం.లు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఆ కేసులో అప్రూవర్ గా మారిన అతనిని ముంబై కోర్టు వీడియో కాన్ఫరెన్సింగ్ పద్దతిలో విచారించేందుకు అమెరికా ప్రభుత్వం అంగీకరించడంతో, మళ్ళీ ఇవ్వాళ్ళ అతనిని అదే పద్దతిలో ముంబైలోని కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.
ఆ సందర్భంగా అబ్దుల్ వహాబ్ ఖాన్ అనే భారత న్యాయవాది అడిగిన ప్రశ్నకు డేవిడ్ హెడ్లీ సమాధానం చెపుతూ “శివసేన అధ్యక్షుడు బాల్ థాకరేని హత్య చేయమని ఎల్.టి.టి.ఈ. ఉగ్రవాద సంస్థ నన్ను, మరొక వ్యక్తిని పురమాయించింది. అందుకోసం మేము శివసేన కార్యాలయం వద్ద రెండు సార్లు రెక్కీ కూడా నిర్వహించాము. సరయిన అవకాశం చిక్కినప్పుడు బాల్ థాకరేని హత్య చేయాలనుకొన్నాము. కానీ ఈలోగా రెండవ వ్యక్తి పోలీసులకి పట్టుబడటంతో నేను అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాను. ఆ తరువాత ఏమి జరిగిందో నాకు సమాచారం లేదు,” అని జవాబిచ్చాడు.
ఈ ఆపరేషన్ కోసం లష్కర్ సంస్థ మీకు ఎంత డబ్బు ముట్టజెప్పిందని లాయర్ ప్రశ్నించనపుడు డేవిడ్ హెడ్లీ చెప్పిన సమాధానం చాలా ఆశ్చర్యం కలిగించింది. “లష్కర్ ఏ-తోయిబా సంస్థ నాకేనాడు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. నేనే తిరిగి సుమారు 60-70 లక్షల పాకిస్తాన్ రూపాయలు దానికి ఇచ్చేను. 2006లో నేను చివరిసారిగా దానికి డబ్బు ఇచ్చినట్లు గుర్తు,” అని చెప్పాడు.
నిన్న అతనిని విచారణ చేసినప్పుడు ఇంకా విస్మయం కలిగించే విషయం ఒకటి చెప్పాడు. తన పాకిస్తాన్ ప్రయాణాలకి అమెరికా ప్రభుత్వమే నిధులు సమకూర్చిందని చెప్పాడు. అదే నిజమయితే లష్కర్ ఉగ్రవాద సంస్థకి అతను ఇచ్చేనని చెపుతున్న60-70 లక్షల పాకిస్తాన్ రూపాయలను కూడా అమెరికా ప్రభుత్వమే సమకూర్చిఉండాలని అనుమానించక తప్పదు.
అతని పాకిస్తాన్ ప్రయాణాలకి అమెరికా డబ్బు సమకూర్చడానికి అతను అమెరికాకు చెందిన సి.ఐ.ఏ. ఏజంటు కాదు మరొకటి కాడు. లష్కర్ వంటి ఒక భయకరమయిన ఉగ్రవాద సంస్థ కోసం పని చేస్తున్నాడు. అటువంటి వ్యక్తికి అమెరికా ప్రభుత్వం డబ్బు ఎందుకు సమకూర్చింది? అనే ప్రశ్నకు సమాధానం స్పష్టంగా తెలియకపోయినా, తద్వారా లష్కర్ ఉగ్రవాద సంస్థకి ఒకప్పుడు అమెరికా మద్దతు ఇచ్చిందని స్పష్టమవుతోంది. లష్కర్ సంస్థ భారత్ పై దాడులకు కుట్రలు పన్నుతోందని తెలిసీ అమెరికా దానికి నిధులు సమకూర్చి ఉండి ఉంటే అంతకంటే దారుణమయిన ఆలోచన మరొకటి ఉండబోదు. డేవిడ్ హెడ్లీ విచారణలో ఇటువంటి విషయాలు బయటపెడితే భారత్-అమెరికా సంబంధాలు దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది కనుక అతనిని ముంబై కోర్టు విచారించేందుకు ఇంకా అమెరికా అనుమతించదేమో?