అండర్ వరల్డ్ డాన్, అనేక టెర్రర్ దాడులతో సంబంధాలున్న వ్యక్తి , ఇండియా కోరుకుంటున్న మోస్ట్ వాంటెడ్ నేరగాళ్లలో ఒకడైన దావూద్ ఇబ్రహిం పాకిస్తాన్ లోని సొంతిళ్ల గుట్టు బయటపడింది.
రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాల్సిన పాకిస్తాన్, ఇప్పటిదాకా చెబుతున్న బుకాయింపు మాటలు ఇక చెల్లవు. కరడుగట్టిన నేరగాడు దావూద్ కి పాకిస్తాన్ లో ఒకటికాదు, రెండు కాదు, ఏకంగా 9 ఇళ్లు ఉన్నాయనడానికి తగిన సాక్షాధారాలను భారత్ సేకరించింది. పూర్తి ఆధారాలతో కూడిన పత్రాలను పాకిస్తాన్ కు పంపించింది.
గాంగ్ స్టర్ దావూద్ పొరుగుదేశమైన పాకిస్తాన్ తొమ్మిదిళ్ల ఆసామి. అందులో ఒకటి ఆ దేశ మాజీ ప్రధానమంత్రి బెనజిర్ భుట్టో కుమారుడు బిల్వాల్ భుట్టో జర్దారీ ఇంటికి సమీపంలోనే ఉండటం గమనార్హం. తన ఉనికి బాహ్యప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు తరచూ నివాసాలు మార్చడంలో ఘటికుడైన దావూద్ పాకిస్తాన్ లో ఏకంగా 9చోట్ల కుంపట్లు పెట్టుకున్నప్పటికీ తమకా సంగతే తెలియదన్నట్టు పాకిస్తాన్ చాలా బాగా నటిస్తోంది. కరడుగట్టిన నేరస్థుడ్ని పట్టించాల్సిందిపోయి కల్లబొల్లికబుర్లు చెబుతోంది పాకిస్తాన్.
ఈ మధ్యనే కరాచీలోని జియాయుద్దీన్ ఆస్పత్రికి చేరువలో ఒక ఇల్లు కొనుక్కున్నాడు. 2013 సెప్టెంబర్ లో ఈ ఇంటిని కొనుగోలుచేసినట్టు భారత్ ఆధారాలు సంపాదించింది. తనకు చికిత్స అవసరమైనప్పుడు ఈ ఇంటికి వస్తాడు దావూద్. తొమ్మిదిల్ల పూజారిలా తనకు అవసరమైనప్పుడు మకాం మార్చేస్తుంటాడు దావూద్. పాకిస్తాన్ లోని 9 ఇళ్ల అడ్రస్ లతో సహా ఆధారపత్రాలను భారత్ సిద్ధంచేసి వాటిని పాకిస్తాన్ ముఖానపడేసింది. ఇప్పుడేమంటారని నిలదీసి అడుగుతోంది. పాకిస్తాన్ లో తరచూ అడ్రెస్సులు మారుస్తుండే దావూద్ , పాకిస్తాన్ ఏజెన్సీల రక్షణలో తన కార్యక్రమాలను నేర్పుగా చక్కబెట్టుకుంటున్నాడని ఈ పత్రాలు వెల్లడించాయి.
3 పాకిస్తానీ పాస్ పోర్టులు
అంతేకాదు, దావూద్ కి మూడు పాకిస్తానీ పాస్ పోర్ట్ లు కూడా ఉన్నాయని ఈ పత్రాలు వెల్లడించాయి. మొదటిది రావుల్పిండిలో జారీచేస్తే, మరో రెండు కరాచీలో జారీ చేసినవి. దావూద్ భార్య మహాజాబీన్ కి కూడా పాకిస్తానీ పాస్ పోర్ట్ ఉంది. అలాగే కొడుకు మూయీనా, కూతురు మెహ్రూఖ్ కీ అక్కడే పాస్ పోర్టులు ఉన్నాయి.
అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ 2003 అక్టోబర్ 16న దావూద్ ని గ్లోబల్ టెర్రరిస్ట్ గా గుర్తించడం, అలాగే అదే సంవత్సరం నవంబర్ 3 యూనైటెడ్ నేషన్స్ జాబితాలో అల్ ఖైదా సంస్థతో సంబంధాలున్న వ్యక్తిగా దావూద్ పేరుఉండటాన్ని కూడా భారత్ తన ఆధారపత్రాల్లో తేటతెల్లంచేసింది. ఐక్యరాజ్యసమితి నోటీస్ ను తుంగలోతోక్కేసి దావూద్ కి రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వకుండా పాకిస్తాన్ నాటకాలాడుతోంది. ఇప్పుడు భారత్ ఈ ధ్రువపత్రాలను పంపిస్తూ ఇప్పటికైనా పాకిస్తాన్ దావూద్ ని అప్పగించాలని కోరింది. మరి ఇప్పుడు పాక్ ఏముఖం పెట్టుకుని మాట్లాడుతుందో చూడాలి. ఈ సందర్భంగా దావూద్ చీకటి రాజ్యంలో సాగించిన ఘనకార్యాలేమిటో ఓసారి పరికిద్దాం…
దావూద్ గురించి 5 విషయాలు
1. పోలీస్ అధికారి కొడుకు:
దావూద్ ఇబ్రహీం తమ దేశంలో లేడని పాకిస్తాన్ బుకాయిస్తున్నా, అతను అక్కడే ఉన్నాడనడానికి బలమైన ఆధారాలున్నాయి. దావూద్ నిజానికి ఓ పోలీస్ ఆఫీసర్ కొడుకు. 1955 డిసెంబర్ 26న మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఒక హెడ్ కానిస్టేబుల్ కి పుట్టాడు. ఇతను కొంకణి ముస్లీం కమ్యూనిటీకి చెందినవాడు. మొదట్లో ముంబయికి చెందిన కరీం లాలా గ్యాంగ్ లో చేరి నేరాలచేయడం మొదలుపెట్టాడు. ఆ వెంటనే హవాలా వ్యాపారంలోకి దిగాడు. స్మగ్లర్ గా మారిపోయాడు. 2011 నుంచి ఇంటర్ పోల్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నాడు.
2. ముంబయి 1993 దాడుల వ్యూహకర్త
ముంబయిలో 1993లో జరిగిన వరుస బాంబుపేలుళ్ల కేసులో ఇతని ప్లానింగ్ ఉంది. ఈ దాడుల్లో 257 మంది మరణించారు. వందలాదిమంది గాయపడ్డారు. పాకిస్తాన్ కి చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్ (ఐఎస్ఐ) ఏజెన్సీతో సంబంధాలు పెట్టుకుని ఈ వరుస బాంబుపేలుళ్లకు వ్యూహరచన, ఆర్థిక అండదండలు అందించినట్టు తేలింది.
ఈ కేసులోనే దోషిగా ఉన్న యాకుబ్ మీమన్ ను గతనెలలో ఉరితీశారు. అయితే ఈ ఉరితీతను కొన్ని సామాజిక వర్గాలు వ్యతిరేకించాయి. అసలు దోషి దావూద్ అయితే, యాకుబ్ ని ఉరితీయడమేమిటని ప్రశ్నించాయి.
3. దుబాయ్ లో చీకటి రాజ్యం:
దావూద్ ఇబ్రహిం దుబాయ్ కి మకాం మార్చినతర్వాత డి-కంపెనీ తెరిచాడు. దాన్ని దక్షిణఆసియాలోనే అతిపెద్ద మాఫియా గ్యాంగ్ గా తీర్చిదిద్దాడు. ఈ చీకటి రాజ్యాన్ని యుఏఈ, ఇండియా, పాకిస్తాన్ లో స్థావరాలు ఏర్పాటుచేసుకున్నాడు. 2003లో అమెరికా ప్రభుత్వం ఇతగాడ్ని స్పెషల్లీ డిసిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ గా గుర్తించి అతని ఆస్తులను అమెరికాలో స్తంభింపజేసింది. ఇబ్రహిం సిండికేట్ నుంచి వస్తున్న ధనప్రవాహాన్ని కట్టడిచేయకపోతే అనేక విధ్వంసాలు తప్పవని అమెరికా అప్పట్లో అంతర్జాతీయ సమాజాలను హెచ్చరించింది.
4. ఇస్లామిక్ టెర్రరిజంతో లింక్ :
దావూద్ ఇబ్రహిం నేరచేష్టలు ఇక్కడితో ఆగలేదు. ఇస్లామిక్ ఉగ్రవాదులతో కూడా సంబంధాలు పెట్టుకునే స్థాయికి వెళ్ళాయి. అల్ ఖైదాతో సంబంధాలున్నట్టు అమెరికా 2002లో స్పష్టంచేసింది. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక ఊతం ఇచ్చే విషయంలో ఇబ్రహిం సిండికేట్ సాయపడిందని అమెరికా ఆరోపించింది.
5. క్రికెట్, బాలీవుడ్ సంబంధాలు:
దావూద్ కి క్రికెట్ సంబంధాలు కూడా ఉన్నాయి. షార్జా క్రికెట్ స్టేడియంలో ఒకప్పుడు ఇతను చెప్పిందేవేదం. ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ లప్పుడు ఇతని హవాకు అంతేలేదు. అలేగా బాలీవుడ్ మీద కూడా దావూద్ ప్రభావం పడింది. ఎంతోమంది నటులపై ప్రభావం చూపాడు. ఆయన జీవితచరిత్ర ఆధారంగా హిందీలో కంపెనీ, డి అండ్ డి డే వంటి సినిమాలొచ్చాయి.
ఇంతటి నేరచరిత్రను సొంతం చేసుకున్న దావూద్ ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్నట్టు సాక్ష్యాధారాలతో భారత్ చెబుతున్నప్పుడు మరి పాకిస్తాన్ ఏం చేస్తుందో చూడాలి. ఒక పక్క శాంతి చర్చలు, మరోపక్క ఉగ్రవాదులకు అండగా ఉండే నైజాన్ని పాకిస్తాన్ మానుకుంటేనేకానీ ఇరు దేశాల మధ్య సుస్థిర శాంతి చేకూరదు.
– కణ్వస
(kanvasa19@gmail.com)