అండర్ వరల్డ్ డాన్… దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోనే ఉన్నాడని భారత్ ఎప్పటి నుంచో చెబుతోంది. కరాచీలోని ఫలానా చోట ఉన్నాడంటూ ఆధారాలు కూడా ఇచ్చింది. కానీ పాకిస్తాన్ మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతూ వచ్చింది. మోస్ట్ వాంటెడ్కి షెల్టర్ ఇచ్చి పెంచి పోషిస్తున్న దాయాది.. దావూద్ ఇబ్రహీం తమ దేశంలోనే ఉన్నాడని ప్రకటించింది. నిజానికి ప్రకటించాల్సి వచ్చింది. ఉగ్రవాదులకు సాయం చేస్తున్నారంటూ ప్రపంచదేశాలు పాకిస్తాన్‌ను గ్రే లిస్టులో పెట్టాయి. సరైన చర్యలు తీసుకోకపోతే రూపాయి కూడా సాయం చేయబోమని హెచ్చరించాయి. ఇంత కాలం అండగా ఉన్న సౌదీతో కూడా సున్నం పెట్టుకున్న పాకిస్తాన్‌కు సాయం ఆగిపోతే… కడుపుకాలిపోతుంది. అప్పులు పుట్టని పరిస్థితి ఎదురవుతోంది. పాకిస్తాన్ ఇచ్చిన ఉగ్రవాదుల లిస్ట్‌లో దావూద్ ఇబ్రహీం పేరును కూడా చేర్చింది.
అంతర్జాతీయ ఆర్థిక సాయం కోసం పాకిస్తాన్.. ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటున్నట్లు కలర్ ఇస్తోంది. 88 నిషేధిత ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. దావూద్ ఇబ్రహీంతో పాటు మసూద్ అజార్, జకీర్ ఉల్ రెహ్మాన్ లక్వీల పేర్లు ఉన్నాయి. ఉగ్రవాద సంస్థలపై కఠినమైన ఆంక్షలు విధించినట్లు పాకిస్తాన్ ఓ ప్రకటనలో చెప్పింది. దీంతోనే దావూద్ ఇబ్రహీం గుట్టు బయటికి వచ్చింది. నిజానికి దావూద్ పాకిస్తాన్లో ఉన్నాడని ఇండియా ఎప్పటినుంచో చెబుతోంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. అప్పిచ్చే దేశాలు కూడా ఛీ కొడుతున్నాయి. అప్పట్లో ఆదుకుంటామని సౌదీ చెప్పినప్పటికీ.. తర్వాత దాయాది వంకర బుద్ధి తెలిసి చీకొట్టింది. అందుకే హడావుడిగా ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకున్నట్లు చెబుతోంది.
దావూద్ ఇబ్రహీం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. 1993 ముంబై సీరియల్ బ్లాస్ట్‌లో కీలక నిందితుడు. అప్పుడు భారత్ విడిచి వెళ్లిన దావూద్ ఇబ్రహీం.. పాక్‌లో అక్కడి ప్రభుత్వం నుంచి రాచ మర్యాదాలు పొందుతున్నాడి భారత్ ఆరోపిస్తోంది. బాంబు పేలుళ్లే కాదు.. ముంబైలోని అనేక ఇల్లీగల్ బిజినెస్ వెనుక కూడా దావూద్ ఉన్నట్లు పోలీసులు చెబుతారు. దావూద్ ఇబ్రహీం కరాచీలోని క్లిఫ్టన్ ప్రాంతంలో ఉన్న సౌదీ మసీద్ దగ్గరున్న వైట్‌హౌస్‌లో ఉంటున్నట్లు పాకిస్తాన్ అధికారులు చెబుతున్నారు. మరి ఇప్పుడు భారత్ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఉన్నట్లు అంగీకరించినందున.. తమకు అప్పగించాలని భారత్ పట్టుబట్టే అవకాశం ఉంది.