అండర్ గ్రౌండ్ డాన్, టెర్రరిస్ట్ కార్యకలాపాలతో సంబంధమున్న వ్యక్తి దావూద్ ఇబ్రహిం వాడిన కారుని రేపు ఢిల్లీకి చేరువలోని ఘజియాబాద్ లో పట్టపగలు తగలబెట్టబోతున్నారు. ఇది కారుకు అంత్యక్రియలు చేయడంలాంటిదేనని హిందూ సంస్థ నాయకుడొకరు చెబుతున్నారు.
ఈనెల (డిసెంబర్) 9న ముంబయిలో జరిగిన దావూద్ వాడిన వస్తువుల వేలంపాటలో అతను వాడిన గ్రీన్ కలర్ హ్యూందయ్ ఎసెంట్ కారుని కేవలం 32వేల రూపాయలకు హిందూమహాసభ నాయకుడు స్వామి చక్రపాణి డిసెంబర్ 9న జరిగిన వేలంపాటలో దక్కించుకున్నారు. అలా సొంతం చేసుకున్న ఈ కారుని రేపు (బుధవారం – డిసెంబర్ 23) దావూద్ చేష్టలకు నిరసనగా ఘజియాబాద్ లో ప్రజలు చూస్తుండగా తగలబెడతారట. ఘజియాబాద్ లోని ఇంద్రపురంలో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రెండు గంటల మధ్య ఈ `కారు దగ్ధం’ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు చక్రపాణి చెబుతున్నారు. రామజన్మభూమి కేసులో చక్రపాణి కూడా ఒక పిటీషనర్ గా ఉన్నారు.
ఉగ్రవాద వికృత చేష్టలతో దేశానికి మరీ ముఖ్యంగా ముంబయికి తీవ్రనష్టం కలిగిస్తున్న దావూద్, అతని సహచరల పోకడలను నిరసిస్తూ, అంత్యక్రియలు చేయడమన్న భావనకు ప్రతీకగా దావూద్ వాడిన కారును దగ్ధం చేస్తున్నామనీ, దీన్ని ఎవ్వరూ ఆపలేరని హిందూత్వ సంస్థ నాయకుడు చెబుతున్నారు.
వేలంపాటలో కారు సొంతం చేసుకోగానే ఆయన ఈ కారును మొదట్లో అంబులెన్స్ గా వాడదామనుకున్నారు. అయితే, డి-కంపెనీకి చెందిన వారెవరో రెచ్చగొట్టేరీతిలో హెచ్చరికలు చేయడంతో చక్రపాణి మనసు మార్చుకున్నారు. దీంతో కారుకు నిప్పుపెట్టాలన్న నిర్ణయానికి వచ్చామని చెబుతున్నారు. తనకు ఎలాంటి భద్రత అక్కర్లేదని చక్రపాణి చెబుతున్నప్పటికీ, మొన్నీమధ్యనే ఆయన ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో తనకు బెదరింపులొస్తున్నాయని ఫిర్యాదు చేయడం గమనార్హం.
ఈ కారు ఇప్పుడు రన్నింగ్ స్థితిలో లేదు. బాగా పాడైంది. దావూద్ వాడిన వివిధ వస్తువులను ముంబయిలో వేలం వేసినప్పుడు ఈ కారును కూడా ఉంచారు. ఇప్పుడు, చక్రపాణి దక్కించుకోవడంతో ఈ డొక్కుకారు ముంబయి నుంచి ఢిల్లీకి చేరుకుంది. అక్కడి నుంచి దాన్ని ఘజియాబాద్ కు తీసుకెళ్ళి అక్కడ రేపు దానికి చక్రపాణి భాషలో `అంత్యక్రియలు’ చేస్తారు.