సినిమాలకే కాదు ఇప్పుడు ఓటీటీకి కూడా కంటెంట్ కొరత వుంది. ఒరిజినల్ కథలని ఓకే చేయడానికి అంత సులువుగా ముందుకి రావడం లేదు ఓటీటీ సంస్థలు. ఏదైనా కొత్త కథ చెప్పి ఓకే చేయించుకోవడం ఇప్పుడు దర్శక రచయితలకు పెద్ద సవాల్. ఓటీటీ సంస్థలు కూడా రిస్క్ తీసుకోవడం మానేసి రీమేకుల మీద పడ్డాయి. ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ కూడా అదే దిశలో ఆలోచిస్తున్నారు. కొత్త కథల మీద కాకుండా మంచి కంటెంట్ వుండి కూడా అంతగా ప్రచారం పొందని, అంతగా పాపులర్ కానీ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో వున్న సినిమాలని, వెబ్ సిరిస్ లపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే బెంగాలీ వెబ్ సిరిస్ తక్దీర్ ( Taqdeer) ని జేడీ చక్రవర్తి తో ‘దయా’గా రీమేక్ చేశాడు దర్శకుడు పవన్ సాదినేని. ఇదో క్రైమ్ థ్రిల్లర్. ఒరిజినల్ తక్దీర్ లో ఆసక్తికరమైన క్రైమ్ డ్రామా వుంటుంది. బంగ్లాదేశ్ కోస్టల్ నేపధ్యంలో సాగే ఈ క్రైమ్ సిరిస్ అక్కడి రాజకీయ పరిస్థితులు, స్థితిగతులు, మీడియా..ఇలా ప్రతి అంశాన్ని కథలో సహజంగానే ఇమిడ్చారు. దీనికి రీమేక్ గా వచ్చిన ‘దయా’లో ఎలాంటి మార్పులు చేశారు? ఎనిమిది ఎపిసోడ్స్ వున్న ఈ సిరిస్ ఎంత ఆసక్తికరంగా సాగింది?
దయా (జేడీ చక్రవర్తి) కాకినాడ హార్బర్ ఏరియాలో ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. తనకి చెవుడు. మిషన్ పెట్టుకుంటేనే వినిపిస్తుంది. దయ భార్య అలివేలు (ఇషారెబ్బా) నిండు గర్భిణి. మరో రోజులో తనని హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి. పని ముగించుకొని ఇంటికి వెల్లిపోదామనుకునే సమయంలో డబ్బులెక్కువ వస్తున్నాయనే ఆశతో మరో కిరాయిని ఒప్పుకొంటాడు దయా. ఆ లోడ్ దించే సమయంలో ఫ్రీజర్ వ్యాన్ లో ఓ డెడ్ బాడీని చూసి షాక్ అవుతాడు. ఆ డెడ్‌బాడీ ఎవరిది? ఫ్రీజర్‌లోకి ఎలా వచ్చింది? ఆ బాడీని దయా ఏం చేశాడు? అసలు దయా ఎవరు
? అతడి నేపధ్యం ఏమిటి? ఆ డెడ్ బాడీతో కథ ఎలాంటి మలుపులు తీసుకుంది అనేది మిగతా సిరిస్.
దయాలో మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ వున్నాయి. ఒరిజినల్ కథ తక్దీర్ ని ఫాలో అవుతూ తెలుగు నేటివిటీకి తగ్గట్లు కొన్ని మార్పులు ( అవి కూడా పూర్తిగా తెలుగు అనిపించవు) చేసుకొని ఈ సిరిస్ ని తీశారు. తొలి ఎపిసోడ్ లోనే కథలోకి వెళ్లారు. ఫ్రీజర్ వ్యాన్ లో శవం కనిపించడంతో తర్వాత వచ్చే ఎపిసోడ్స్ పై అంచనాలు ఆసక్తి పెరుగుతుంది. ఐతే ఆ ఆసక్తిని తర్వాత వచ్చే ఎపిసోడ్ అంతగా కొనసాగించేలేకపోయాయి. ఈ మాత్రం మలుపులు వున్న సిరిస్ బెంగాలీ ఆడియన్స్ కి కొత్త ఏమో కానీ .. ఈ తరహా సిరిస్ లు ఆద్యంతం ఉత్కంఠగా సాగే క్రైమ్ స్టోరీలు ఇదివరకే చూసిన ఆడియన్స్ కి మాత్రం .. దయా ప్రయాణం ఒకటో గేర్ లో సాగినట్లుగా అనిపిస్తుంది. ఈ కథలో ఐదు లేయర్లు వున్నాయి. దయా, జర్నలిస్ట్ కవిత (రమ్య) స్థానిక ఎమ్మెల్యే పరశురామ రాజు (పృథ్వీరాజ్) కవిత భర్త కౌశిక్ (కమల్ కామరాజు), ఒక అత్యాచార బాధితురాలు. బెంగాలీ లో ఈ సిరిస్ చూస్తున్నపుడు అక్కడ స్థానిక పరిస్థితులకు అద్దం పట్టేవిధంగా తీర్చిదిద్దారు. రీమేక్ లో మాత్రం అది కొరవడింది. ఏదో కథ చూస్తున్న ఫీలింగ్ తప్పితే అందులో జరుగుతున్న సంఘటనలు కాకినాడ హార్బర్ ప్రాంతంలో జరిగాయని నమ్మే విధంగా మాత్రం వుండవు.
తక్దీర్ లో అన్నీ పాత్రలు చుట్టూ కోర్ ఎమోషన్ వుంటుంది. దయా పాత్రతో పాటు మిగతా ట్రాకులన్నీ కథలో భాగం అవుతాయి. ఇందులో మాత్రం దయా పై పెట్టినంత ఫోకస్ మరే పాత్రపై వుండదు. జర్నలిస్ట్ కవితది కీలకమైన పాత్ర. ఆ పాత్రలోనే క్రైమ్ డ్రామా వుంటుంది. కానీ అది అంతగా ఎలివేట్ కాలేదు. పైగా కవిత ఆమె భర్త ట్రాక్ బోరింగ్ వ్యవహారంలా తయారైయింది. ఏవో ఎమోషనల్ సీన్స్ వస్తుంటాయి కానీ ఆ ఎమోషన్స్ తో ఆడియన్ పెద్దగా కనెక్ట్ అవ్వడు. ఒరిజినల్ చూడనివారికి దయా పాత్రలో వచ్చే ట్విస్ట్ సర్ప్రైజ్ చేస్తుంది. ఆ మలుపు తర్వాత కథ వేగం మరింత పుంజుకుంటుంది. ఐతే దయా, అలివేలు సంబధించిన ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు అక్కడక్కడ ఫ్లాష్ లైట్స్ గా చూస్తుంటారు. ఈ సీజన్ లో ఆ ఫ్లాష్ బ్యాక్ ఒక టీజర్ లానే వుంటుంది తప్పితే దానికి సంబధించిన ఎలాంటి డిటేయిల్ చూపించలేదు.
క్రైమ్ కథలు జెడీకి చక్కగా కుదురుతాయి. దయా పాత్రలో చాలా సహజంగా ఇమిడిపోయాడు. తన పాత్రలో రెండు కోణాలు వున్నాయి. మొదటి కోణంలో ఓ అమాయక వ్యాన్ డ్రైవర్ కనిపిస్తే.. రెండో కోణంలో సత్య కనిపిస్తాడు. ఐతే ఈ సీజన్ కి మాత్రం అది డైలాగ్ తోనే సరిపెట్టారు. అసలు దయా గతం ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి ఐతే కలిగింది కానీ.. మళ్ళీ బెంగాలీ మేకర్స్ సీజన్ 2 తీస్తేనే ఆ కోణం చూడగలం. ఇషారెబ్బా కి కూడా బలమైన గతం వుంది. అది కూడా సీజన్ 2 కి పరిమితం చేశారు. జర్నలిస్ట్ గా చేసిన రమ్యది బలమైన పాత్రే. అయితే ఆ పాత్రలో అస్పష్టత వుంటుంది. అలాగే కమల్ కామరాజు ట్రాక్ కూడా గందరగోళంగా వుంటుంది. జోష్ రవికి మంచి పాత్ర దక్కింది. తన నటనతో ఆకట్టుకున్నాడు. అతనిపై అనుమానం వచ్చేలా ప్రతి సీన్ లో శ్రుతిమించి రియాక్ట్ అయ్యేలా ఆ పాత్రని తీర్చిదిద్దారు. వ్యాన్ లో శవం మార్చే ఐడియా ఇచ్చినపుడు ప్రేక్షకుల ద్రుష్టి అతనిపై తిరుగుతుంది. ఐతే ఆ పాత్ర కూడా కాస్త క్లారిటీ లేకుండానే వుంటుంది. దయాకి అతనికి వున్నా బాండింగ్ ని సరిగ్గా ఎస్టాబ్లస్ చేయలేదేమో అనిపిస్తుంది. దయా చివర్లో ఆ పాత్ర గురించి అంత ఎమోషలైపొతుంటే .. ఎందుకింత ఫీలౌతున్నాడనే ఫీలింగ్ కలుగుతుందంటే కారణం.. బాండింగ్ ని సరిగ్గా డిజైన్ చేయకపోవడమే. విష్ణు ప్రియకి కూడా నటించే అవకాశం దక్కింది. ఎమ్మెల్యే గా చేసిన పృథ్వీరాజ్ ది అదోరకం పాత్ర. నేటివిటికి దూరంగా వుంటుంది. ఆ పాత్రలో సెన్సార్ చేయాల్సిన కంటెంట్ చాలా వుంది. మిగతా పాత్రలు పరిధిమేర వుంటాయి.
కెమరాపనితనం బావుంది. క్రైమ్ డ్రామాకి కావాల్సిన మూడ్ ని క్రియేట్ చేశారు. నేపధ్య సంగీతం ఆకట్టుకునేలా చేశారు. పవన్ సాదినేని కథ విషయంలో ఒరిజినల్ ని ఫాలో అయిపోయాడు. చివరికి నిడివిపరంగా కూడా. కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. కవిత ట్రాక్ ని ఇంకాస్త క్లారిటీగా షార్ప్ గా ఉండేలా చూసుకోవాల్సింది. నిజం చెప్పాలంటే ఈ సిరిస్ కి దయా అనే పేరు పెట్టారు కానీ.. అసలు దయా కథ ఇందులో రివిల్ కాలేదు.
‘సూర్యుడు అస్తమిస్తే యుద్ధం ముగిసినట్లుకాదు. మళ్ళీ ఎప్పుడు ఉదయిస్తాడా అని యుద్ధమే ఎదురుచూస్తుంది’ ఈ చివర్లో దయా చెప్పిన డైలాగ్ ఇది. ఈ డైలాగ్ ప్రకారం రెండో సీజన్ లో యుద్ధం ఉంటుందని అనుకోవాలి. బావుంది… అయితే ఈ సీజన్ లో ముగిసిన యుద్ధం ఏమిటా ప్రశ్నించుకొని ఎపిసోడ్స్ అన్నీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకున్నా.. ఒక యుద్ధం జరిగింది.. అది ముగిసిందని అనే ఫీలింగ్ అయితే కలగదు.