వార్తలు చదివే వారిని కించ పరచడం కానీ… వారిని తక్కువ చేయడం కానీ.. వారి విజ్ఞానాన్ని తక్కువ చేసి చూపడం వంటి … పద ప్రయోగాలు చేయవద్దని జర్నలిజంలో ఓ పాఠంగా పెద్దలు చెబుతూ ఉంటారు. అదే పాఠకులను కించ పరిస్తే జరిగే అనర్థం వేరు. కాలగర్భంలో కలిసిపోయిన పత్రికలు చేసిన తప్పులు అవే. ఇప్పుడు అదే పద్దతిలో కాలగర్భంలో కలిసిపోతున్న డెక్కన్ క్రానికల్ కూడా…. పోతోంది. తమ దుస్థితిని చూసి.. కనీసం కాస్త మెరుగ్గా ఆలోచిద్దామన్న ఆలోచన చేయలేదు. ఏప్రిల్ ఫూల్స్ డే రోజు పాఠకులందర్నీ ఫూల్స్ చేసేశామని సంబర పడింది. కానీ ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఆ పత్రికపై గట్టిగానే పడుతుంది.
వ్యాపారికి కస్టమర్ దేవుడు. పత్రికకు పాఠకుడు దేవుడు. దానికితగ్గట్లుగా మసలుకోవాలి. కానీ ఆ దేవుళ్లను ఫూల్స్ చేయాలనుకుంటే మొదటికే మోసం వస్తుంది. ఏప్రిల్ ఒకటో తేదీన ఫూల్స్ డే అంటూ… డెక్కన్ క్రానికల్ ఓ కథనం రాసింది. ఆ కథనం సారాంసం ఏమిటంటే… “బీజేపీలో టీడీపీ విలీనం.. డీల్ పూర్తి చేసుకున్న చంద్రబాబు” అంతా రాసేసి చివరికి.. తూచ్ చదివిన వాళ్లంతా ఏప్రిల్ ఫూల్ అయ్యారు అంటూ … ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఆ స్టోరీ మొదటి నుంచి చివరి వరకూ చదివిన వారికి కోపం నషాళానికి అంటి… పేపర్ విసిరి కిందకు కొట్టేసి ఉంటారు. అది నిజం అనుకుని భ్రమపడేవారో.. లేకపోతే.. సీరియస్ వార్తల్ని మాత్రమే ఇష్టపడేవారో మాత్రమే కాదు… ఫన్నీ వార్తలను కూడా అలా ప్రజెంట్ చేయడం.. చాలా మందికి నచ్చలేదు. సోషల్ మీడియాలో వస్తున్న ఫీడ్ బ్యాకే దీనికి నిదర్శనం.
ప్రింట్ మీడియా పరిస్థితి దారుణంగా ఉంది. డెక్కన్ క్రానికల్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. అక్కడ జీతాలు ఇస్తున్నారో ఇవ్వడం లేదో కూడా ఎవరికీ తెలియడ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సంస్థను మరింతగా దిగజార్చేలా… కూర్చున్న కొమ్మనే నరుక్కునేలా కొంత మంది జర్నలిస్టులు రాజకీయ పార్టీలతో కుమ్మక్కయి ఇలాంటి కథనాలు రాస్తున్నారు. అది వారి జేబులు నింపుతుందేమో కానీ… తమకు బతుకునిచ్చిన సంస్థకు .. పత్రికకు అంతిమసంస్కారాలు నిర్వహించినట్లవుతుంది. కానీ ఈ జర్నలిస్టుకు ఆ ఆలోచన కూడా లేనట్లుగా ఉంది.