తాము వదిలిన అస్త్రం తమకే ముప్పుగా మారుతుందని కమలనాథులు ఊహించి ఉండరు. కేజ్రీవాల్ ను ఎదుర్కొనే క్రమంలో, సొంత పార్టీ నుంచే మిస్సయిల్ లాంటి ఆరోపణలు దూసుకు వస్తాయని గెస్ చేసి ఉండరు. ఇప్పుడు నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై అవినీతి ఆరోపణలు చేసి సొంత పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్ ను బీజేపీ నుంచి సస్పెండ్ చేశారు.
ఢిల్లీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కే్జ్రీవాల్ కార్యదర్శి రాజేంద్ర కుమార్ పై సీబీఐ దాడులు జరపడం ఊహించని మలుపు తిరిగింది. ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా అరుణ్ జైట్లీ చేసి అవినీతికి సంబంధించిన ఫైళ్ల కోసమే ఈ దాడులని ఆప్ ఆరోపించింది. పనిలో పనిగా, తన ఆఫీసుమీద దాడి చేశారంటూ కే్జ్రీవాల్ మోడీని టార్గెట్ చేశారు.
ఈ ఆరోపణలను అరుణ్ జైట్లీ ఖండిస్తుండగానే ఆయనకు ఊహించని షాక్ తగిలింది. జైట్లీ హయాంలో అవినీతి జరిగిందని, సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్ ఆరోపణల అస్త్రాన్ని ప్రయోగించారు. ఇది జైట్లీని ఉక్కిరి బిక్కిరి చేసింది. కీర్తి ఆజాద్ మీడియా సమావేశం పెట్టడానికి ముందే, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఆయన్ని పిలిచి హెచ్చరించారు. జైట్లీపై ఆరోపణలు చేయవద్దని వార్నింగ్ ఇచ్చారు. అయినా వినలేదు. పైగా, పార్లమెంటులోనూ జైట్లీపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ మాట్లాడటం జైట్లీకి మరింత కోపం తెప్పించింది. ప్రధాని మోడీకి జైట్లీ సన్నిహితుడు, అత్యంత విశ్వసనీయుడు. దీంతో, కీర్తి ఆజాద్ పై వేటు పడింది.
ఇక్కడ బీజేపీకి దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. తొందరపడి కీర్తి ఆజాద్ పై చర్య తీసుకోవడం విమర్శలకు దారితీయ వచ్చు. తీసుకోకపోతే, ఆప్ నేతల ఆరోపణలకు కీర్తి ఆజాద్ వల్ల బలం చేకూరినట్టు అవుతుంది. దీంతో, వేటు వేయడానికే నిర్ణయించారు. అయితే, ఈ మొత్తం వ్యవహారంలో కీర్తి ఆజాద్ తప్పు చేసినట్టు కనిపించదు. క్రికెట్ సంఘంలో అవినీతి జరిగిందని భావించారు కాబట్టి, విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే, బాహాటంగా రచ్చ చేయకుండా పార్టీ వేదికమీద ఈ అంశాన్ని లేవనెత్తితే మరో విధంగా ఉండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎంత అవినీతి వ్యవహారమైనా, ప్రతిపక్షాలకు కొత్త అస్త్రాన్ని అందించే తరహాలో బహిరంగ విమర్శలకు చేయడం అంత మంచిది కాదనే అభిప్రాయం వినవస్తోంది.
ఈ తరుణంలో అసలు అవినీతి జరిగిందా లేదా అనేది తేల్చడానికి కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశించాలనే డిమాండ్ పెరుగుతోంది. జైట్లీ ప్రధానికి సన్నిహితుడైనంత మాత్రాన, ఇంత తీవ్రమైన ఆరోపణలపై విచారణ జరిపించకుండా మిన్నకుండి పోవడం బీజేపీకి మంచిది కాదు. అవినీతిపై పోరాడతానని చెప్పే మోడీ, తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయమిది. సీబీఐ అధికార పార్టీ గుప్పిట్లో ఉందా లేదా అనేది తర్వాతి సంగతి, అసలు దానిచేత విచారణకు ఆదేశించడం కొంతలో కొంత నయం కదా.