కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్ డిల్లీ, జిల్లా క్రికెట్ అసోసియేషన్ (డిడిసిఏ) అధ్యక్షుడుగా ఉన్నప్పుడు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు చేసినందుకు ఆయన డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై రూ.10 కోట్లకి పరువు నష్టం దావా కేసు వేశారు. కేజ్రీవాల్ అందుకు ఏమాత్రం భయపడలేదు. డిడిసిఏలో సెక్స్ రాకెట్ కూడా కొనసాగుతోందని మరో బాంబు పేల్చారు.
ఈరోజు ఆమాద్మీ పార్టీ సీనియర్ నేత అశుతోష్ మరొక బాంబు పేల్చారు. ఒక బ్యాంక్ కి చెందిన క్రికెట్ సంఘంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై చేస్తున్న దర్యాప్తుని నిలిపివేయవలసిందిగా కోరుతూ అరుణ్ జైట్లీ అప్పటి డిల్లీ పోలీస్ కమీషనర్ బికె గుప్తా మరియు అప్పటి స్పెషల్ కమీషనర్ రంజిత్ నారాయణ్ కి వ్రాసిన రెండు లేఖలను మీడియాకి విడుదల చేసారు. “డిడిసిఏలో ఎటువంటి అవినీతి జరుగలేదని,పాల్పడలేదని వాదిస్తున్న అరుణ్ జైట్లీ దర్యాప్తుని నిలిపివేయమని పోలీస్ కమీషనర్లకు ఎందుకు లేఖలు వ్రాసారు?” అని అశుతోష్ ప్రశ్నించారు. “కనీసం ఇప్పటికయినా జైట్లీ తన పదవికి రాజీనామా చేసి విచారణ కమిటీ ముందు హాజరయ్యి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని అశుతోష్ సవాలు విసిరారు.
అరవింద్ కేజ్రీవాల్ డిడిసిఏపై ఇన్ని తీవ్ర ఆరోపణలు చేస్తున్నప్పటికీ ఇన్ని రోజులు మౌనంగా ఉన్న డిడిసిఏ బోర్డు సభ్యులు ఎట్టకేలకు బుదవారం స్పందించారు. డిడిసిఏ తాత్కాలిక అధ్యక్షుడు చేతన్ చౌహాన్, మిగిలిన బోర్డు సభ్యులతో కలిసి నేడు డిల్లీలో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.
“అరవింద్ కేజ్రీవాల్,కీర్తి ఆజాద్ ఇరువురూ చేస్తున్న నిరాధారమయిన ఆరోపణల వలన డిడిసిఏ ప్రతిష్టకి భంగం వాటిల్లుతోంది. కనుక వారిరువురిపై న్యాయపరమయిన చర్యలు చేప్పట్టాలని నిశ్చయించుకొన్నాము. వారిరువురిపై పరువు నష్టం దావా వేయాలనుకొంటున్నాము. ఇప్పటికే మూడు దర్యాప్తు సంస్థలు డిడిసిఏపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నాయి. కనుక డిల్లీ ప్రభుత్వం కొత్తగా మరో విచారణ కమిటీని నియమించవలసిన అవసరం ఉందని మేము భావించడం లేదు,” అని తెలిపారు. డిడిసిఏలో ఎటువంటి అవినీతి, అక్రమాలు జరగలేదని మీడియా సమావేశం పెట్టి చెపుతున్న ఆ బోర్డు సభ్యులే మూడు వేర్వేరు దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయని చెప్పుకోవడం గమనిస్తే, కేజ్రీవాల్ తదితరులు చేస్తున్న ఆరోపణలు నిరాదారమయినవి కావని స్పష్టం అవుతోంది.