వచ్చే ఏడాది జూన్ నుంచి పోలవరం నీళ్లు కాలువల్లో పారాలని.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తొమ్మిది నెలల పదవి కాలంలో ఈ శుక్రవారం ఆయన రెండో సారి పోలవరంలో పర్యటించారు. ఏరియల్ సర్వే చేసి.. ప్రాజెక్ట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికి అక్కడ పనులేమీ జరగడం లేదు. రివర్స్ టెండరింగ్‌తో టెండర్ దక్కించుకున్న మేఘా కంపెనీ చాలా పరిమితమైన వనరులతోనే పనులు నిర్వహిస్తోంది. గతంలో భారీ యంత్రాలతో.. వందల కొద్దీ వాహనాలు హడావుడిగా తిరుగుతూ పనులు చేస్తూఉండేవి. ప్రస్తుతం అక్కడ పనులేమీ పెద్దగా జరగకడం లేదు.
పోలవరం ప్రాజెక్ట్ సైట్ వద్ద ఒక్క భారీ యంత్రం కూడా లేదు. కొన్ని లారీలు.. ఓ ఇరవై మంది కూలీలు మాత్రం ఉన్నారు. ఈ వేగంతో పనులు జరిగితే.. కష్టమేనని సీఎం భావించారేమో కానీ… జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కూడా పనులు జరగాలని ఆదేశించారు. వాస్తవానికి పోలవరం పనులు గరిష్టంగా ఆరేడు నెలలు మాత్రమే జరగడానికి అవకాశం ఉంది. వర్షాకాలం ప్రారంభమై.. గోదావరి వరద వస్తే.. పనులు ఆగిపోతాయి. ప్రాజెక్ట్ స్పిల్ వే కూడా మునిగిపోతుంది.పనులు చేయడానికికాదు కదా..కనీసం అక్కడకు మనుషులు వెళ్లడానికి కూడా అవకాశం ఉండదు. అలాంటి సమయంలో పనులు చేసి ప్రాజెక్టు పనులు పరుగులు తీయాలని జగన్ ఆదేశించారు.
పోలవరం ప్రాజెక్ట్ పనులు అసలు జరగడం లేదని… ప్రాజెక్ట్ పూర్తి చేయకపోతే.. ప్రజలు క్షమించరని ఉండవల్లి లాంటి నేతలు హెచ్చరిస్తున్నారు. అయితే.. ప్రాజెక్టుకు నిధుల గండం వెంటాడుతోంది. కేంద్రం రీఎంబర్స్ చేసిన నిధులను ఇతర అవసరాలకు వాడుకున్నారు. ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఖర్చు చేయడం లేదు. ముందు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే..తర్వాత కేంద్రం ఇస్తుంది. ఇప్పుడు రాష్ట్రం ఖర్చు చేయకపోతూండటంతో పనులు జరగడం లేదు. అదే సమయంలో..సహాయ పునరావాస కార్యక్రమాలకు 30వేల కోట్లకుపైగానే అవసరం. దాని గురించి స్పష్టత లేదు.