అయ్యా, చంద్రబాబుగారూ…
అమరావతి శంకుస్థాపన పనుల్లో మీరు చాలాబిజీబిజీగా ఉన్నట్టున్నారు. మరి నామొర పట్టించుకుంటారో లేదో. అయినా మీకు ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. మై బ్రిక్ మై అమరావతి అంటూ మీరి ఇచ్చిన పిలుపుమేరకు చాలా ఫాస్ట్ గా స్పందించి అదే రోజున ఓ వందరూపాయలు కట్టి పది ఇటుకలు కొని మీకు , అదే అమరావతి నిర్మాణ నిధికి పంపించాను. ఇప్పుడు నాకెంతో ఆనందంగా ఉంది, అమరావతి నిర్మాణంలో నేనుసైతం భాగస్వామి అయినందుకు. అమరావతిపై నాకు ఈ విధంగా ఏర్పడిన హక్కుతో నేను మిమ్మల్ని సూటిగా ఓ ప్రశ్న అడుగుతున్నాను. దయచేసి సమాధానం ఇవ్వండి.
మహాశయా, తమరు అందరి దగ్గర నుంచి ఇటుకలకోసం డబ్బులు తీసుకుంటున్నారు. బాగానేఉంది. కానీ తమరెన్ని ఇటుకలు కొంటున్నారు? మాబోటి సామాన్యుడే ఓ పది ఇటుకలు కొంటే, మీబోటి ఘనాసిరిసంపన్నులు ఎన్ని ఇటుకలు కొని ఇవ్వాలి? అందుకే నేను డిమాండ్ చేస్తున్నాను… మీరు స్వయంగా హీనపక్షం ఓ రెండులక్షల ఇటుకలన్నా ఇవ్వాలి. అలాగే మీ కుటుంబసభ్యుల చేత ఇప్పించాలి. ఆఁ..మరిచాను, ఒక ఎమ్మెల్సీ సీటుకోసమే ఐదుకోట్లకు బేరం కుదర్చడంలో కీలకపాత్రపోషించిన రేవంత్ రెడ్డి ఎన్ని ఇటుకలు కొనబోతున్నారో చెప్పాలి. శంకుస్థాపనకు ఇంకా కేవలం 24 గంటలమాత్రమే వ్యవధి ఉంది. వెంటనే మీరూ, మీవాళ్లచేత ఎన్ని బ్రిక్స్ అమరావతికి ఇస్తారో చెప్పాలి. లేకపోతే మీపై బ్రిక్ స్ట్రోక్ పడుతుంది జాగ్రత్త…
ఇట్లు,
అమరావతి నిర్మాణానికి ఇటుకలిచ్చిన సామాన్యుడు