కబాలి, కాలా… ఇలా వరుసగా రజనీ ఫ్యాన్స్ రెండు గట్టి దెబ్బలు తిన్నారు. కబాలిపై రజనీ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఏదో అనుకుంటే ఇంకేదో తీశాడు రంజిత్. కాలాపై వాళ్లు ఎలాంటి ఆశలూ లేవు. ‘వస్తుంది.. చూస్తాం..’ అన్నట్టు ఉన్నారు తప్ప పెద్దగా హడావుడి చేయలేదు. అయితే మనసులో మాత్రం ఏదో ఓ మూల నమ్మకం. ‘కబాలి’ ఫ్లాప్ అయినా.. మళ్లీ అవకాశం ఇచ్చాడంటే.. ‘కాలా’లో ఏదో విషయం ఉండే ఉంటుంది అనుకున్నారు. కానీ… ఆ ఆశలూ ఆవిరైపోయాయి. రజనీకాంత్ సినిమాకి దర్శకత్వం వవహించే అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు. ఒక్కసారిగా దశ, దిశ మారిపోతాయి. అలాంటిది వరుసగా రెండు సార్లు ఛాన్సిచ్చాడు రజనీ. రెండుసార్లూ నిలబెట్టుకోలేకపోయాడు రంజిత్. దాంతో రజనీ ఫ్యాన్స్ చాలా హర్టవుతున్నారు. రెండు సార్లు అవకాశం ఇచ్చినా కాపాడుకోలేని రంజిత్‌దే తప్పంతా అన్నట్టు మాట్లాడుతున్నారు. రంజిత్ గురించి చాలా ట్రోల్స్ నడుస్తున్నాయి.
అయితే రజనీ ఫ్యాన్స్ ఇక్కడ ఓ విషయం గుర్తు పెట్టుకోవాలి. `కబాలి` అవకాశాన్ని రజనీ ఇచ్చిన మాట వాస్తవం. దాన్ని రంజిత్ నిలబెట్టుకోకపోయిన విషయమూ నిజమే. కానీ.. `కాలా`లో మళ్లీ ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి? రంజిత్ స్టైల్ అంతా రజనీకి తెలిసిందే కదా? రంజిత్ ఎప్పుడూ ఎక్కడా ‘సారూ. నాకో అవకాశం ఇవ్వండి’ అంటూ రజనీని బతిమాలి ఉండడు. అంటే… రంజిత్‌తో సినిమా చేయాలి అని రజనీ గట్టిగా ఫిక్సయితే తప్ప `కాలా` లాంటి సినిమా పట్టాలెక్కదు. ‘కాలా’ కథ రజనీని సరిపోయేది కాదు. మరి ఈ కథని రజనీ ఎలా ఎప్పుకోగలిగాడు? నిర్మాత ధనుష్ ఇప్పుడు రజనీ అల్లుడు కావొచ్చు. ఒకప్పుడు రజనీకి భయంకరమైన ఫ్యాన్. తనకైనా తెలీదా… తన హీరోకి ఎలాంటి కథ సూటవుతుందో?? కథేంటో, దాన్ని ఎలా తీయబోతున్నామో రజనీకి, ధనుష్‌కీ ముందే తెలుసు. జనాల్లోకివెళ్తుంది లే అనుకున్నారు. కానీ అది వర్కవుట్ కాలేదు. ఇందులో రంజిత్ తప్పెంత ఉందో, రజనీ తప్పూ అంతే ఉంది.
సినిమా చూస్తే ఓ విషయం అర్థమైపోతుంది. ఒకే సెట్లో, దాన్ని దాటి బయటకు వెళ్లకుండా ఓ కథ కావాలి అని రంజిత్‌కి చెప్పి `కాలా` లాంటి స్క్రిప్టు రాయించుకుని ఉంటారు. నిజానికి `కాలా` లాంటి కథకు పెద్దగా బడ్జెట్ అవసరం లేదు. పైగా నానా పటేకర్ తప్పితే పేరున్న నటుడు ఎవ్వరూ కనిపించలేదు. టెక్నికల్‌గా సౌండ్ ఉన్నవాళ్లెవ్వరూ పనిచేయలేదు. కాబట్టి `మినిమం` బడ్జెట్లో ఈ సినిమాని లాగేంచేసి ఉంటారు. రజనీ సినిమా అంటే మార్కెట్ భారీ ఎత్తున జరుగుతుంది. ఆ విధంగా విడుదలకు ముందే డబ్బు చేసుకోవచ్చనుకున్నారు. అందుకే ఈ దశలో ఇలాంటి సినిమాతో వచ్చాడు రజనీ. దాని వెనుక ఆర్థిక పరమైన లెక్కలు చాలా వేసుకుని ఉంటాడు. ఈ సినిమా ఏదో.. `రోబో 2` తరవాత వచ్చుంటే బాగుండేది. ఎందుకంటే `రోబో 2` మార్కెట్ వేరు. శంకర్ అంత సాదాసీదాగా సినిమా తీయడు. ఆ సినిమా ఆడుంటే.. అప్పుడు కనీసం `కాలా`కి మార్కెట్ ఏర్పడుదును.. ఓపెనింగ్స్ వద్దును. ఆ అవకాశం కూడా పాడుచేసుకున్నాడు రజనీ.