రానురాను సోషల్ మీడియాలో కొందరికి సృహ లేకుండా పోతుంది. సున్నితమైన అంశాలుపై కూడా కనీస సోయి లేకుండా పోస్టలని వైరల్ చేస్తున్నారు. ఈ రోజు అలాంటి ఓ తప్పుడు ప్రచారం చాలా మందిని కలవర పెట్టింది. హీరోయిన్, కాంగ్రెస్ మాజీ ఎంపీ రమ్య మృతి చెందారనే వార్త సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్గా మారింది. ఆమె గుండెపోటుతో మరణించారని ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. దీంతో ఆ వార్త ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ముందు వెనుక చూడకుండా కొందరు రిప్ మెసేజులు కూడా పెట్టేశారు. కొన్ని ప్రముఖ వెబ్ సైట్లు కూడా ఈ వార్తని రాసేశాయి.
నిజం ఏమిటంటే.. రమ్య నిక్షేపంగా వున్నారు. ప్రస్తుతం రమ్య జెనీవాలో వున్నారు. ఆమెకు ఫోన్ చేసి విషయం చెబితే.. ఇలాంటి వార్తలు ప్రచారం చేసే ముందు నిజానిజాలు తెలుసుకోరా ? అంటూ అసహనాన్ని వ్యక్తం చేసినట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఈ విషయం పై స్పందించారు. ఇలాంటి తప్పుడు వార్తలని నమ్మోద్దని స్పష్టం చేశారు.
పునీత్ రాజ్ కుమార్ హీరోగా చేసిన ‘అభి’ అనే కన్నడ సినిమాతో హీరోయిన్ గా అరంగేట్రం చేశారు రమ్య. సూర్య నటించిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ సినిమాతో ఆమెకు మంచి పేరు వచ్చింది. తర్వాత సినిమాలు తగ్గించి రాజకీయాల్లోకి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఇటివలే హాస్టల్ హుడుగారు బేకగిద్దారే సినిమాలో గెస్ట్ పాత్ర పోషించారు. ఈ సినిమా తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరుతో విడుదలైయింది.