చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి ఉరిశిక్ష విధించేలా పోక్సో చట్టంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మార్పు నేపధ్యంలో… తొలి ఉరి శిక్ష తెలంగాణలో పడబతోంది. వరంగల్‌లో పసికందుపై అత్యాచారం కేసులో దోషి ప్రవీణ్‌కు ఉరిశిక్షను ఖరారు చేస్తూ.. ఫస్ట్ అడిషనల్ జడ్జి జయకుమార్ తీర్పునిచ్చారు. జడ్జి జయకుమార్ ఎదుట ప్రవీణ్ నేరాన్ని అంగీకరించాడు. 48రోజుల్లో విచారణ పూర్తి చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు .. తీర్పు వెలువరించింది. జూన్ 18న హన్మకొండలో 9నెలల చిన్నారి శ్రీహిత …తల్లి పక్కన నిద్రిస్తున్న సమయంలో ప్రవీణ్ ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి చంపాడు. చిన్నారిపై హత్యాచారం ఘటనను నిరసిస్తూ తెలుగు రాష్ట్రాల్లో ధర్నాలు జరిగాయి.
ఈ కేసులో కేవలం 21 రోజుల్లో చార్జీషీట్ దాఖలు చేశారు వరంగల్ పోలీసులు. 48 రోజుల్లో ముద్దాయికి ఉరిశిక్ష విధించడం దేశ చరిత్రలో మొదటి సారి. దేశంలో.. చిన్నారులపై లైంగిక ఆకృత్యాలు పెరిగిపోతూండటంతో.. కేంద్ర ప్రభుత్వం కామాంధులకు ఉరిశిక్షే సరైనదని నిర్ణయించింది. చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడే కిరాతకులను కఠినంగా శిక్షించేందుకు పోక్సో చట్టంలో సవరణలు చేసింది. పసి పిల్లలపై లైంగిక దాడికి పాల్పడటం, హార్మోనుల ద్వారా శరీరంలో మార్పులు కలిగేలా చేయడం, వారితో నీలిచిత్రాలు తీయడం వంటి నేరాలకు పాల్పడిన వారికి ఉరిశిక్ష ఖరారు చేసింది. ”ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్యువల్ అఫెన్సెస్ ” చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. దానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఇప్పుడు… మొదటి సారిగా.. పసికందుపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడికి ఉరిశిక్ష ఖరారయింది.
అయితే.. చట్టంలో ఉన్న లొసుగులతో నిందితుడ్ని.. రక్షించకుండా.. వీలైనంత త్వరా శిక్షను అమలు చేస్తే. ఇతరులు అలాంటి నేరాలు చేయడానికి భయపడతారన్న అభిప్రాయం సాధారణ ప్రజల్లో ఉంది. ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగిన తర్వాత నిర్భయ చట్టం తీసుకు వచ్చారు. అయితే.. ఆ చట్టం ఆధారంగా కేసులు పెట్టినా… నిందితులు సులువుగా బయటకు వచ్చేస్తున్నారు.