కోవిడ్ ఎఫెక్ట్… పత్రికలపై బాగా పడింది. కొన్ని ప్రధాన పత్రికలు ఉద్యోగుల్ని తలగొంచాల్సివచ్చింది. జీతాలకు కోత విధించారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగు పడుతున్నాయి. అయితే సడన్ గా ఇప్పుడు కోవిడ్ పేరు చెప్పి డెక్కెన్ క్రానికల్ ఉద్యోగస్థుల జీతాలకు సంస్థ కోత వేసింది. ఉద్యోగుల జీతం నుంచి 20 శాతం కట్ చేస్తూ… నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులు నిరసనకు దిగారు. హైదరాబాద్ కేంద్రంలో ప్రస్తుతం ఉద్యోగులు సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఈ ఉదయం నుంచి `పెన్ డౌన్` చేసి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. డెక్కెన్ క్రానికల్ ఉద్యోగస్థులకు సెప్టెంబరు నుంచి జీతాల్లేవు. అంటే జీతం అందుకుని 5 నెలలు అయ్యిందన్నమాట. ఈ ఐదు నెలల జీతాల గురించి ఉద్యోగ సంస్థ నాయకులు ఆరా తీస్తే.. `20 శాతం కోత విధించి.. జీతాలు అందిస్తామ`ని యాజమాన్యం చెప్పింది. అసలే ఐదు నెలల నుంచి జీతాలు లేవు, ఇప్పుడు అందులో 20 శాతం కోతేంటి? అన్నది ఉద్యోగస్థుల ప్రశ్న. పైగా కోవిడ్ బాధలు తప్పాయి. సంస్థ మళ్లీ గాడిలో పడింది. ఇలాంటప్పుడు కోత విధించడం భావ్యం కాదని ఉద్యోగులు వాదిస్తున్నారు.