ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత దేశ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించిందని అనిపిస్తే ఆ పార్టీ గ్రాఫ్ అమాంతం పెరుగుతుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలకు ముందు కాంగ్రెస్.. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పరిస్థితిని చూస్తే ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పైచేయి సాధిస్తే ఎలా ఉంటుందన్న చర్చ కొంత కాలంగా జరుగుతోంది. పదేళ్ల కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కానీ అది బయటకు రావాలంటే బలమైన ప్రత్యామ్నాయం కావాలి. అది కాంగ్రెస్ పార్టీ రూపంలో ప్రజల ముందు ఉండే అవకాశం ఉంది. దేశంలో దక్షిణాదిన బీజేపీ ఉనికి లేదు. ఆ పార్టీ దక్షిణాదిలో చేస్తున్న ప్రయోగాలు వికటిస్తున్నాయి. ఇక ఉత్తరాదిలో ముఖ్యంగా హిందీబెల్ట్ లో 90 శాతానికిపైగా ఫలితాలు సాధించారు. మళ్లీ ఎన్నికలు జరిగితే అంత కంటే తగ్గుతాయి కానీ పెరగవు.
ఇప్పుడు ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ తలపడ్డాయి. మధ్యప్రదేశ్, రాజస్ఖాన్, చత్తీస్ ఘడ్లలో బీజేపీతో.. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ అప్రకటిత కూటమితో కాంగ్రెస్ తలపడుతోంది. మెరుగైన ఫలితాలు సాధిస్తే.. అది బీజేపీ కూటమిపై సాధించిన విజయమే. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఫలితాలు మరింత మెరుగ్గా మారడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో విజయం సాధిస్తే.. దేశవ్యాప్తంగా ఓ వేవ్ వస్తుంది. బీజేపీ గెలిస్తే ఆ పార్టీకి తిరుగు ఉండదు.
ఐదు రాష్ట్రాల ఎన్నికలు దేశ రాజకీయాల్ని మలుపు తిప్పబోతున్నాయని తెలంగాణ లో ప్రచారం చేస్తున్న నేతంలతా అంటున్నారు. అది నిజమే కానీ.. ఎవరి వైపు మలుపు తిరుగుతాయన్నది మాత్రం ఎవరూ చెప్పడం లేదు. ఎందుకంటే అది ఓటర్ల చేతుల్లో ఉంది మరి.