చక్కటి ఆరంభం ఎంతటి కీలకమో, అంతేఘనంగా ముగించడం కూడా అంతే అవసరం. కానీ… 2018 వెళ్తూ వెళ్తూ… బోలెడన్ని ఫ్లాపులిచ్చి వెళ్తోంది. డిసెంబరులో భారీ పరాజయాలు చిత్రసీమని గుక్క తిప్పుకోనివ్వకుండా చేస్తున్నాయి. జనవరిలో పెద్ద సినిమాల హడావుడి ఉంటుందని భావించి, డిసెంబరులో సినిమాలు రిలీజ్ చేయడానికి తొందరపడిన నిర్మాతలకు ఫలితాలు గట్టి షాక్ ఇచ్చాయి. డిసెంబరులో దాదాపు 16 తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ అనిపించుకోలేదు. అంచనాలతో వచ్చి, ఆశలు రేపిన పడి పడి లేచె మనసు, అంతరిక్షం చిత్రాలు కూడా అటు నిర్మాతలకు, ఇటు పంపిణీదారులకు చుక్కలు చూపించాయి.
ఆపరేషన్ దుర్యోధన 2019, కవచం, నెక్ట్స్ ఏంటి?, శుభలేఖలు, సుబ్రహ్మణ్యపురం, అనగనగా ఓ ప్రేమకథ, భైరవ గీత… ఇలా వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. శుక్రవారం విడుదలైన బ్లఫ్ మాస్టర్కీ అంతంత మాత్రపు స్పందనే వచ్చింది. ఇదం జగత్ అయితే వచ్చిన సంగతే ఎవరికీ తెలీకుండా పోయింది. ఈ నెలలో విడుదలైన చిన్న సినిమా ‘హుషారు’ మాత్రమే నిర్మాతలకు తృప్తినీ, లాభాల్నీ మిగిల్చింది. డబ్బింగ్ బొమ్మ ‘కేజీఎఫ్’కి ఓపెనింగ్స్ బాగున్నాయి. ఇవి మినహాయిస్తే… డిసెంబరు చాలా చప్పగా సాగింది.