ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ఎప్పటికీ మారరు. అందరికీ కూడా రాజకీయ ప్రయోజనాలు, వ్యాపార ప్రయోజనాలే కావాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏం తప్పులు చేశారో.. ఇఫ్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన టైంలో కూడా అవే తప్పిదాలు చేస్తున్నారు. తెలంగాణా ఉద్యమానికి జై కొట్టక తప్పని పరిస్థితిని కెసీఆర్ సృష్టిస్తే.. సీమాంధ్ర నాయకులందరూ కూడా ఆ ఉచ్చులో పడ్డారు. వాస్తవంగా ఆలోచిస్తే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడడం ఏ ఒక్క సీమాంధ్ర రాజకీయ నాయకుడికి కూడా ఇష్టం లేదు. అలాగని అదంతా సీమాంధ్ర ప్రజలపైన ఉన్న ప్రేమతో అనుకునేరు. మళ్ళీ ఓట్ల కోసం సీమాంధ్ర ప్రజల ముందుకు వెళ్ళలేం అన్న భయంతో. అయితే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు మేం వ్యతిరేకం అని బహిరంగంగా చెప్పే ధైర్యం కూడా లేదు. ఎందుకంటే తెలంగాణా ప్రజల ఓట్లు కావాలి కాబట్టి. కాంగ్రెస్ పార్టీ ఎలాగూ తెలంగాణా ఇవ్వదన్న ధైర్యంతో ఎవరి డ్రామాలు వాళ్ళు ఆడారు. ప్రత్యేక తెలంగాణా ఇవ్వాల్సిందేనని లేఖల మీద లేఖలు రాశారు. అసెంబ్లీ తీర్మానానికి అందరూ ఆమోదం తెలిపారు. ప్రత్యేక తెలంగాణా ఎందుకివ్వరు అని ప్రశ్నించారు. ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటవకుండా అడ్డుకునే సత్తా సీమాంధ్ర నాయకులకు ఉందని నమ్మిన సీమాంధ్ర ప్రజలు కూడా ధైర్యంగా ఉన్నారు. కొడుకును ప్రధానమంత్రిని చేయాలన్న సోనియా ఆశ, ఆశయం కోసం తెరాసను కాంగ్రెస్‌లో కలిపేస్తానన్న కెసీఆర్ రాజకీయ చాణక్యం కలిసి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమయ్యేలా చేశాయి.
ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు చేయడానికి అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీ డెసిషన్ తీసుకున్న తర్వాత, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఖాయమని తెలిశాక సీమాంధ్ర నాయకులు, సమైక్యాంధ్ర వీరులు నిద్రలేచారు. వీరత్వం ప్రదర్శించారు. వీరంగం వేశారు. గొప్ప గొప్ప నటుల కంటే కూడా గొప్పగా నటించారు. సీమాంధ్ర ప్రజల దృష్టిలో సమైక్యాంధ్ర వీరులుగా నిలబడిపోవడానికి అహర్నిశలూ కష్టపడ్డారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికో, రాజధాని లేకుండా, ఆర్థికలోటుతో ఏర్పాటు కాబోతున్న అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా న్యాయం జరిగేలా చేయడానికో ఎవ్వరూ ఏమీ ప్రయత్నాలు చేయలేదు. సీమాంధ్ర ప్రజల దృష్టిలో హీరోలవడం కోసం, ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టడం కోసం మాత్రం ఎవరి స్థాయి ప్రతిభను వాళ్ళు ప్రదర్శించారు. అందులో కూడా అత్యంత అనుభవజ్ఙుడే విజయం సాధించాడు. మమ్మల్ని గెలిపించండి…ఆంధ్రప్రదేశ్‌ని సింగపూర్, అమెరికా, చైనా, జపాన్….ఇంకా బోలెడన్ని దేశాల్లా చేసేస్తాం అని చెప్పుకోవడానికి మాత్రం అందరూ తాపత్రయపడ్డారు. అందరి పెర్ఫార్మెన్స్ బాగానే ఉన్నా.. మీడియా సపోర్ట్ బలంగా ఉన్నవాళ్ళ మాటలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మేశారు. నిజం చెప్పాలంటే మీడియావాళ్ళు, చివరి నిమిషంలో జత కలిసిన భజన బృందం కలిసి సీమాంధ్ర ప్రజలు నమ్మేవరకూ…వాళ్ళ చెవుల తుప్పు వదిలేలా….ఊదరగొట్టిపడేశారు. నమ్మకపోతే ఛస్తారన్న రేంజ్లో కూడా ప్రచారం చేసి పడేశారు. అధికారంలోకి వచ్చారు.
అధికారంలోకి రావడానికి బలమైన ఆయుధంగా ఉపయోగపడిన ప్రత్యేక హోదా అంశానికి సంబంధించిన నిర్ణయం కూడా ఇప్పుడు ఫైనల్ స్టేజ్‌లో ఉంది. రెండేళ్ళ తర్వాత కూడా ఇంకా నాన్చితే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం ఎఫెక్ట్ దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పైన చూపించినట్టు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందో అని బిజెపి భయపడుతోంది. అందుకే ఏదో ఒక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులేస్తోంది. ఇప్పుడు మళ్ళీ సీమాంధ్ర నాయకులు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు సమయంలో చూపించిన సినిమాను రిపీట్ చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఛాంపియన్స్ అనిపించుకోవడానికి అందరూ రంగంలోకి దిగారు. ఎవ్వరి సినిమా వాళ్ళు చూపిస్తున్నారు. అధికారంలో లేని వాళ్ళ విషయం పక్కన పెడితే ప్రత్యేక హోదా పేరు చెప్పుకుని ఓట్లు దండుకున్నవాళ్ళు మాత్రం ఇప్పుడు భలే విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాయే ప్రాణాధారం అన్న రేంజ్లో పార్లమెంట్లో అద్వితీయ హీరోయిజం చూపించిన వెంకయ్యనాయుడు…ఇప్పుడు పెద్ద గజినీ అయిపోయి గతం మర్చిపోయాడు. ప్రత్యేక హోదాతో ఒరిగేదేమీ లేదు అని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడేమో..వాళ్ళను నిర్ణయం తీసుకోనిద్దాం….ఏమిస్తారో చూద్దాం…ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అంటున్నారు.
నిర్ణయం తీసుకున్నాక చేసేదేం ఉంటుంది….వంకాయ. ‘నన్ను సంప్రదించలేదు, పదిమందినీ కూర్చుండబెట్టి మాట్లాడమని చెప్పాను, నా మాట వినలేదు, నిర్ణయం పద్ధతిగా లేదు, ఇష్టం వచ్చినట్టు చేసేశారు….’ అని నాలుగు రంకెలేయడం, కన్నెర్ర చేయడం, అవసరమైతే ఓ రెండు, మూడు దొంగ దీక్షలు చేయడం…..ఈ లోపు ఎలాగూ ఎన్నికలు వస్తాయి కాబట్టి….నేనే హీరో, నేనే సమర్ధుడిని…..నేనే తోపుని…అని మరోసారి సీమాంధ్ర ప్రజల ఓట్లు కొల్లగొట్టడానికి ప్రయత్నాలు చేయడం……అంతా సేం టు సేం సినిమా. తెలంగాణా ప్రజలు, నాయకులతో పాటు దేశవ్యాప్తంగా కూడా చాలా మంది సీమాంధ్ర ప్రజలను జాలిగా చూస్తున్న మాట మాత్రం కఠోర వాస్తవం. మీడియాను తమ కబంధ హస్తాల్లో పెట్టుకున్న వాళ్ళెవ్వరూ కూడా ఎప్పటికీ ప్రజలకు వాస్తవాలను తెలియనివ్వరన్నది కూడా నిజం.