దేశ విభజన నాటి నుండి సమస్యగా ఉండిపోయిన కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం… ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకోబోతోందని… కొద్ది రోజులుగా… జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. కశ్మీర్ మొత్తాన్ని ఖాళీ చేయించారు. అక్కడి ప్రజలు.. కనీసం నెలకు సరిపడా రోజువారి జీవితానికి కావాల్సిన నిత్యావసర సరుకులు దగ్గర పెట్టుకునే ప్రొత్సహిస్తున్నారు. మరో వైపు.. పర్యాటకుల్ని ఖాళీ చేయించారు. విద్యాసంస్థల్ని మూసి వేయించారు. ఓ రకంగా.. ఓ యుద్ధక్షేత్రం అక్కడ రెడీ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఏం చేయబోతున్నారో మాత్రం క్లారిటీ లేదు. అది ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు మాత్రమే తెలుసు. ఏం చేయబోతున్నారనేది.. ఈ రోజు తేలిపోయే అవకాశం ఉంది.
ఆర్టికల్ 370ని రద్దు చేయబోతున్నారా…?
కశ్మీర్ దేశంలో భాగం అయినప్పటికీ.. భాగం కాదన్న అభిప్రాయాన్ని కల్పించే పరిస్థితిని.. ఆర్టికల్ 370 కల్పిస్తోంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 జమ్ము-కశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్రం హోదాను ఇచ్చింది. 1947లో భారత్-పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు జమ్ము-కశ్మీర్ రాజు హరి సింగ్ స్వతంత్రంగా ఉండాలనుకున్నారు. కానీ తర్వాత ఆయన కొన్ని షరతులతో భారత్‌లో విలీనం అయ్యేందుకు అంగీకరించారు. ఆ తర్వాత భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 నిబంధనను రూపొందించారు. దీని ప్రకారం జమ్ము-కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. దాని ప్రకారం.. ఆ రాష్ట్రానికి ప్రత్యేకమైన రాజ్యాంగం ఉంది. అంటే.. రక్షణ, విదేశాంగ విధానాలు, కమ్యూనికేషన్ అంశాల మినహా వేరే ఏ అంశానికి సంబంధించిన చట్టాన్ని రూపొందించాలన్నా, అమలు చేయాలన్నా కేంద్రం జమ్ము-కశ్మీర్ ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. జమ్ము-కశ్మీర్ రాజ్యాంగంలో సెక్షన్ 35ఎ ఉంది. ఇది ఆర్టికల్ 370లో భాగం కూడా.
పార్లమెంట్ సమావేశాలు పొడిగించింది అందుకేనా..?
వాస్తవానికి పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు ఒకటో తేదీతో ముగియాలి. కానీ.. ఏడో తేదీకి పొడిగించారు. అత్యవసరమైన బిల్లుల కోసమన్నట్లుగా కేంద్రం ప్రచారం చేసింది. కానీ అసలు విషయం మాత్రం.. కశ్మీర్‌పై అంతిమ నిర్ణయం తీసుకోవడానికన్నట్లుగా తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. 2014లో లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన మ్యానిఫెస్టోలో ఆర్టికల్ 370ని తొలగిస్తామని చెప్పింది. బీజేపీ ఈ ఆర్టికల్‌ను చాలా కాలం నుంచీ వ్యతిరేకిస్తూ వస్తోంది. కానీ తర్వాత ప్రభుత్వం దానిపై మౌనం పాటించింది. బీజేపీ ఆర్టికల్ 370ని “రాజ్యాంగ నిర్మాతలు చేసిన పొరపాటు”గా చెబుతుంది. అయితే.. అప్పట్లో బీజేపీకి రాజ్యసభలో పూర్తి మెజార్టీ లేదు. ఇప్పుడు… కూడా పూర్తి మెజార్టీ లేకపోయినా.. మొత్తంగా.. పరిస్థితులను చక్కదిద్దుకోగల రాజకీయ అధికారం ఉంది. అందుకే.. ఈ పార్లమెంట్ ద్వారా ఆర్టికల్ 370ని రద్దు చేయడం ఖాయంగా నిపిస్తోంది. అది రద్దు చేస్తే.. కశ్మీర్ కూడా.. మిగిలిన అన్ని రాష్ట్రాల్లా.. మారిపోతుంది. ప్రత్యేకత ఏమీ ఉండదు.
కశ్మీర్లో అంత భద్రత ఎందుకు..?
నిజానికి.. ఆర్టికల్ 370 రద్దు చేయడానికి కశ్మీర్లో అంతగా భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఏమిటన్నది చాలా మందికి అర్థం కాదు. ఎందుకంటే.. వేర్పాటు వాదులందరికీ.. బలం ఆర్టికల్ 370నే. దాన్నే రద్దు చేస్తే.. ఇక వారెవరూ కామ్‌గా ఉండే అవకాశం లేదు. ఒక్క బీజేపీ మినహా కశ్మీర్ రాజకీయ పార్టీలన్నీ… ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్నాయి. అదే చేస్తే.. తాము భారత్‌లో భాగం కాబోమని.. అప్పటి ఒప్పందాలను గుర్తు చేస్తున్నారు. “370 భారత్, జమ్ము-కశ్మీర్ మధ్య బంధానికి ఒక లింకు లాంటిది. ఉంటే ఆర్టికల్ 370 అయినా ఉండాలి లేదంటే భారత్‌లో కశ్మీర్ భాగం కాకుండా అయినా ఉండాలనేది.. నేషనల్ కాన్ఫరెన్స్ అభిప్రాయం. ఇక పీడీపీ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అయితే.. ముందు నుంచి వేర్పాటువాదంతోనే ఉన్నారు.
ప్రధానంగా కశ్మీర్ భారత్‌లో భాగం అని చెప్పేందుకు ఆర్టికల్ 370ని భారత సర్కార్ రద్దు చేయడానికే అవకాశం ఉంది. అయితే.. అంతకు మించి ఎక్స్ట్రీమ్ చర్యలు తీసుకోవాలనుకుంటే… నేరుగా.. ఉగ్రవాదులపై యుద్ధం పేరుతో.. సరిహద్దు క్యాంపులపై… పొరుగు రాష్ట్ర భూభాగంలో దాడులు కూడా చేయవచ్చు. మొత్తానికి ఓ సంచనాత్మక ఘటన మాత్రం… కొన్ని గంటల్లో చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.