మెడికల్ కాలేజీలలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో ఒకే ప్రవేశ పరీక్షగా నీట్ జరపాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశం ఆహ్వానించదగింది. మొత్తం 35 వరకూ రకరకాల ప్రవేశపరీక్షలు రాయలేక అలసిపోతున్న విద్యార్థులకు ఒకింత ఉపశమనం. దానికి తోడు కొన్ని రాష్ట్రాలలో మనతో సహా ప్రైవేటు యాజమాన్యాలు ఇష్టానుసారం నిర్వహించే ఎంట్రన్స్ ప్రహసనాలకు కూడా ఫుల్స్టాప్ పడుతుంది. అయితే ఈ నిర్ణయం చాలా ఆలస్యం, అనిశ్చితి తర్వాత వచ్చింది. అది కూడా ఈ ఏడాదే అనడం ఒకింత ఇబ్బందికరం. ఈ ఆలస్యానికి కారణం ప్రభుత్వాలు, అత్యున్నత న్యాయస్థానం బాధ్యత వహించాల్సి వుంటుంది.
2013లో తనుకూడా వున్న ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తి కబీర్ ఆధ్వర్యంలో ఇచ్చిన తీర్పును ఇప్పటి ధర్మాసనంలో సభ్యుడైన దావే తప్పుపట్టారంటేనే పొరబాటు వారిదని తేలిపోతుంది. ఇప్పుడు విచారణకు చేపట్టేప్పుడైనా తగు వ్యవధితో తీర్పు వెలువరించలేదు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్టానుసారం వ్యవహరించి బాగా అలస్యం చేశాయి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలు 371(డి) వుంది గనక మినహాయింపు రావొచ్చని దింపుడుకళ్లెం ఆశతో ఆఖరు వరకూ అర్థరహితంగా నిరీక్షించాయి. ఒకరు పరీక్ష పూర్తిచేసి ఫలితాలు ఆఖరులో నిలిపేయగా మరొకరు ఇప్పటికి ఇదమిద్దంగా ప్రకటించడం లేదు. ఈ విషయమై కింది అంశాలు గుర్తించాలి. నీట్ మంచిదే గాని ఈ ఏడాది ఇప్పటికిప్పుడు జరపాల్సి రావడం ఇబ్బందులు కలిగిస్తుంది. కొన్ని రాష్ట్రాలకు కొన్ని తరగతులు విద్యార్థులకు మరింత ఒత్తిడి అవుతుంది.
– పదేపదే ఎంట్రన్స్‌లు రాసే భారం తప్పించి సింగిల్ విండో రావడం, ప్రైవేటు ఎంట్రన్స్‌లు పోవడం చాలా మంచిది. అయితే పరీక్ష వరకే ఇది వుంటుంది. బి,సి క్యాటగరీల ప్రవేశాల విషయంలో పాత వ్యవస్థలలో మార్పు పెద్దగా వుండదు. ఇంకా స్పష్టత కూడా లేదు. ఎంసిఐ ప్రక్షాళణ అంటున్నారు గాని ఎంత వరకూ జరిగేది చూడాల్సిందే.
– సిలబస్‌లలో తేడాలు, నెగిటివ్ ప్రశ్నల కారణంగా కొంత ఒత్తిడి వుంటుంది గనక ఇక మిగిలిన సమయంలోనైనా విద్యార్థులను సిద్దం చేయడంపై కేంద్రీకరించడం మంచిది.
ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని లక్షల్లో వసూళ్లు చేసేందుకు కోచింగ్ వ్యాపారులు సిద్ధమైపోతున్నారు. ప్రభుత్వంచొరవ తీసుకుని దాన్ని అరికట్టడమే గాక తన ద్వారా కూడా విస్త్రతమైన అవగాహన కల్పించే చర్యలు తీసుకోవాలి.
ముందు విస్పష్టమైన విధాన ప్రకటన చేయాలి.