టాలీవుడ్ పీఆర్వోలంతా ఏకమవ్వడం, ఓ మీటింగ్పెట్టుకోవడం చిత్రసీమలో ఆసక్తిని రేకెత్తించింది. ఎందుకంటే పీఆర్ ఓ వ్యవస్థ… టాలీవుడ్లో బలంగా విస్తరిస్తోంది. ఈమధ్య కాలంలో పీఆర్ ఓలు ఎక్కువవ్వడం, వాళ్లకు ప్రాధాన్యత పెరగడం, వాళ్లలో వాళ్లకు కొన్ని గ్రూపులు ఏర్పడ్డం వల్ల.. ఈ మీటింగుపై ఆసక్తి పెరిగేలా చేసింది. టాలీవుడ్ కి చెందిన దాదాపు 30 మంది పీ ఆర్ ఓ లు ఈ మీటింగుకి హాజరయ్యారు.
చలన చిత్ర రంగంలో 24 క్రాఫ్టులున్నాయి. 25వ క్రాఫ్టుగా జర్నలిస్టుల్ని చేర్చాలని, అందులో పీఆర్వోలకు భాగస్వామ్యం కల్పించాలన్నది ప్రధాన అజెండా. పీఆర్వోలలో గ్రూపులు ఏర్పడ్డాయని బయట జరుగుతున్న ప్రచారాన్ని తిప్పి కోట్టడం ఈ మీటింగు ప్రధాన ఉద్దేశం. అంతేకాదు.. ఒకట్రెండు సినిమాలు చేసి `మేం కూడా పీఆర్వోలమే` అని చెప్పుకుంటున్నవాళ్లకు చెక్ పెట్టడం.. మరో ప్రధాన అంశం. ఇది వరకు పీఆర్వో కావాలంటే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. కానీ… ఈ పీ ఆర్ అసోసియేషన్‌లో సభ్యత్వం తీసుకోవాలంటే మాత్రం… కొన్ని అర్హతలు కావాల్సిందే.
గత రెండేళ్లుగా కనీసం రెండు సినిమాలు చేసి, ప్రస్తుతం కనీసం ఒక్క సినిమా అయినా చేతిలో ఉన్న వాళ్లకే ఈ సంఘంలో సభ్యత్వం దొరుకుతుంది. కొత్తగా పీఆర్వో మెంబర్ షిప్ కావాలనుకుంటే, ఏదైనా ఓ పీఆర్వో దగ్గర పది సినిమాలకు అసోసియేట్‌గా పనిచేసి, సోలో పీఆర్వోగా కనీసం 5 సినిమాలు చేయాలి. అలాంటి వాళ్లకే మెంబర్ షిప్ దక్కుతుంది. ఈ అసోసియేషన్‌కి అధ్యక్షుడిగా సీనియర్ పాత్రికేయుడు, పీ ఆర్వో బిఏ రాజుని ఎంచుకున్నారు. ఉపాధ్యక్షులుగా వేణుగోపాల్, సురేష్ కొండేటిలను ఏకగ్రీవంగా ఎంచుకున్నారు.ప్రధాన కార్యదర్శిగా మాధురి మధు, జాయింట్ సెక్రెటరీస్ గా వంశి కాకా, ఏలూరు శ్రీను, కోశాధికారిగా గాండ్ల శ్రీను లను ఏకగ్రీవంగా ఎంచుకున్నారు. 12 మంది సభ్యులను కార్యవర్గ సభ్యులను ఎంపిక చేసారు. మరో మూడు నెలల్లో అసోసియేషన్‌కి ఎన్నికలు నిర్వహించాలని, అప్పుడు కొత్త కార్యవర్గాన్ని ఎంచుకోవాలని పీఆర్వో అసోసియేషన్ ఓ తీర్మాణానికి వచ్చింది.