ఏపీలో మద్యం అనగానే వచ్చినన్ని సెటైర్లు గతంలో ఎప్పుడూ రాలేదేమో. మద్యనిషేధం పేరుతో అధికారంలోకి వచ్చిన వైసీపీ… విచ్చలవిడిగా కొత్త మద్యం బ్రాండ్లను తీసుకొచ్చింది. బ్రాండెడ్ మద్యం ఏపీలో కనుమరుగయ్యాక, కొత్త బ్రాండ్లకు ధరలను భారీగా పెంచేశారు.
దీనిపై చంద్రబాబు సర్కార్ ఫోకస్ చేసింది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా కల్తీ మద్యాన్ని రాష్ట్రంలో అనుమతించకుండా చర్యలు చేపడుతోంది. త్వరలోనే రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ తీసుకరాబోతున్నారు.
కొత్త మద్యం పాలసీలో ఇప్పుడున్న మద్యం రేట్లను కూడా తగ్గించే అవకాశం ఉంది. పక్క రాష్ట్రాలతో పోల్చితే భారీగా ధరలు ఉండటం కూడా యువత గంజాయి వైపు ఆలోచించేందుకు కారణం అవుతుందని… రెగ్యూలర్ రేటుతో బ్రాండెడ్ మద్యాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు.
ఇప్పటికే ఏపీ ఎక్సైజ్ అధికారులు పక్క రాష్ట్రాల్లో ఉన్న మద్యం పాలసీలపై నివేదిక రూపొందించారు. మొత్తం ఆరు రాష్ట్రాల్లో ఉన్న ఎక్సైజ్ పాలసీలను పరిశీలించినట్లు సమాచారం. బ్రాండెడ్ మద్యం తయారు చేసే కంపెనీలతో కూడా చర్చలు మొదలుపెట్టారు. అన్నీ కుదిరితే ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారం నుండి రాష్ట్రంలో బ్రాండెడ్ మద్యం దొరికే అవకాశం ఉంది.
ఇక కొత్త ఎక్సైజ్ పాలసీని అక్టోబర్ నుండి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.