తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జుగా ఉన్న దీపాదాస్ మున్షీని మార్చేయాలని ఆ పార్టీ హైకమాండ్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రులుగా చేసిన వారిని ఇంచార్జుగా నియమించాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం ఇంచార్జ్ గా మాణిక్ రావు థాక్రే కష్టపడ్డారు. గెలిచిన తర్వాత మున్షీకి చాన్సిచ్చారు. ఆమె ఇక్కడ బంగ్లా అద్దెకు తీసుకుని … అనధికారికంగా క్యాంపు ఆఫీసులాగా మార్చేసుకుని సమాంతర పాలన చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు.
ఆమెపై చాలా ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్ కు వచ్చిన వెంటనే ఓ కాంగ్రెస్ నేత నుంచే బీఎండబ్ల్యూ కారు తీసుకున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. దానిపై ఆమె కేసు వేశారు. ఇప్పటికీ కేసు నడుస్తోంది. అ తర్వాత ఆమె సమాంతర ఆఫీసు నుంచి ఎన్నో పనులు చక్కబెట్టే ప్రయత్నం చేశారన్న విమర్శలు ఉన్నాయి. కొంత మంది నేతలను ప్రోత్సహిస్తూ వారికి మంత్రి పదవి ఇప్పించేందుకు .. రేవంత్ ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ వచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి.
సాధారణంగా కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జులు ఆయా రాష్ట్రాల్లో మకాం వేసి మొత్తం పెత్తనం చేయాలని అనుకోరు. ఎప్పుడో ఓ సారి వచ్చి పార్టీ వ్యవహారాల్ని సమన్వయం చేసి వెళ్తారు. కానీ మున్షీ మాత్రం క్యాంపు ఆఫీసు పెట్టేసుకున్నారు. ఇక్కడే ఆమె ఏదో ఆశించారన్న ఆరోపణలు వచ్చాయి. ఆమె పై హైకమాండ్ కూ ఫిర్యాదులు వెళ్లాయని అసలు పని మానేశారన్న నివేదికలు వెళ్లడంతో మార్చేందుకు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.