తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా కొనసాగుతోన్న దీపాదాస్ మున్షీ ఇక్కడే పాతుకుపోవాలని ప్రయత్నిస్తున్నారు.ఇందుకోసం ఆమె ఏఐసీసీలో గట్టిగానే లాబీయింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
టీపీసీసీ చీఫ్ నియామకం సమయంలోనే చత్తీస్ ఘడ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ ను కొత్త ఇంచార్జ్ గా నియమించేందుకు హైకమాండ్ సిద్దమైంది.ఇక, తెలంగాణ రాజకీయాలపై పట్టు దొరికిన సమయంలోనే దీపాదాస్ మున్షీని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ పోస్ట్ నుంచి తప్పిస్తారని సమాచారంతో ఆమె అలర్ట్ అయినట్లుగా ప్రచారం జరిగింది.
తాను ఇంకొంతకాలం తెలంగాణలోనే పని చేస్తానని.. తనను ఇక్కడి నుంచి తప్పించవద్దని ఏఐసీసీలో పెద్దఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. ఆమెకు వ్యతిరేకంగా హైకమాండ్ కు ఫిర్యాదులు కూడా అందాయి. పార్టీ వ్యవహారల్లోనే కాకుండా ప్రభుత్వ వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. నామినేటెడ్ పదవుల భర్తీలో తాను సూచించిన నేతలకు పదవులు ఇవ్వాలని,భద్రత కల్పించాలని పట్టుబట్టినట్లుగా గాంధీ భవన్ వర్గాలు కోడై కూస్తున్నాయి.
మరికొద్ది రోజుల్లోనే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ల ప్రకటన ఉండనుందని.. వాటితోపాటు కొత్త ఇంచార్జ్ ప్రకటన ఉండనుందని సంకేతాలతో దీపాదాస్ మున్షీ అప్రమత్తమైనట్లుగా టాక్ నడుస్తోంది. తనను తెలంగాణ నుంచి కదిలించవద్దని ఏఐసీసీ పెద్దలతో అప్పీల్ చేసినట్లుగా తెలుస్తోంది. మరి దీపాదాస్ లాబీయింగ్ ఫలిస్తుందో.. స్థానచలనం ఉంటుందో త్వరలోనే తేలనుంది.